హార్మోనియం చక్రవర్తి ఖాదర్ బాషా;-- యామిజాల జగదీశ్

 ఖాదర్ బాషా.... హార్మోనియం వాయిస్తూ పాట పాడుతూ తన ప్రతిభను ప్రదర్శించుకున్న ఖాదర్ బాషాను అందరూ హార్మోనియం చక్రవర్తి అనే పిలిచేవారు. ఆయన పూర్తి పేరు ఉరైయూర్ టి.ఎం. ఖాదర్ బాషా!

సినీ పరిశ్రమ ఇంకా తమిళనాడులో అడుగుపెట్టని కాలమది. గ్రామఫోన్ రికార్డులు వచ్చిన తర్వాత గాయకులను, నాటక నటులను వేదికలపై చూడటం కోసం 
నాటకాలు ప్రదర్శించే హాళ్ళకు ప్రేక్షకులు తరలివెళ్తుండేవారు. అటువంటి కాలంలో  పేరుప్రఖ్యాతులు పొందిన నటీనటులకు ధీటుగా అభిమానుల మన్ననలు పొందిన హార్మోనియం కళాకారుడే ఖాదర్ బాషా.
తమిళనాడులో మొట్టమొదటగా ప్రజల మధ్య ప్రసిద్ధి చెందిన హార్మోనియం కళాకారుడు బాషా.
కె.ఎస్. దేవుడు అయ్యర్, కె.ఎస్. చెల్లప్పా అయ్యర్, ఎస్.జి. కిట్టప్ప, టి.ఎం. మరుదప్పా, పి.ఎం. రత్నా బాయి, ఎస్.ఎస్. శారదాంబాళ్, కె.పి. సుందరాంబాళ్ తదితరులు తమ గాత్రంతో కీర్తి గడిస్తే ఖాదర్ బాషా చేత్తోనూ కాళ్ళతోనూ వాయించే అలనాటి హార్మోనియంపై తన ప్రతిభను ప్రదర్శించి మన్ననలు అందుకోవడం విశేషం.
 మాంచి పొడగరి. ధృడశరీరం. దట్టమైన మీసం. మరో మాటలో చెప్పాలంటే ఆజానుబాహుడే బాషా.
ఆయన పుట్టిందెప్పుడో వివరాలు లేవు. 
పుట్టిన చోటు - తిరుచ్చి పరిధిలోని ఉరైయూర్.
తిరుచ్చీ, తంజావూరు ఆరోజుల్లో నాటకాలకు ప్రధాన ప్రాంతాలు. ఈ రెండు ప్రాంతాలలో ఆయనను అందరూ హార్మోనియం చక్రవర్తి అనే పిలిచేవారు.
నాటకాలకు హార్మోనియం వాయించేవారు వేదికపైన ఓ మూల కూర్చునేవారు. వారు బయటవారికి కనిపించకుండా ఓ తడిక అడ్డంగా ఉండేది. కనుక హార్మోనియం వాయించే కళాకారుడు ప్రేక్షకులకు తెలిసేవీలు లేదు. అయితే అటువంటి కాలంలో తడికకు ఇవతలకు వచ్చి హార్మోనియం వాయిస్తూ ప్రేక్షకులకు కనిపించిన తొలి కళాకారుడు ఖాదర్ బాషానే.
 
సౌండ్ స్పీకర్లు లేని కాలంలో ఖాదర్ బాషా పాడుతూ హార్మోనియం వాయిస్తుంటే చివరి వరుసలో ఉన్న వారికీ స్పష్టంగా వినిపించేది ఆయన ఏం పాడుతున్నారో. 
అప్పట్లో ప్రముఖ సంగీత బృందాలన్నీ ఖాదర్ బాషా హార్మోనియం కోసం నిరీక్షించేవి. ఆయన హార్మోనియం వాయిస్తున్నారంటే చాలు జనం తరలివచ్చేవారు. అంతేకాదు చక్రవర్తి ఖాదర్ బాషా హార్మోనియంతో....నాటక ప్రదర్శన అని ప్రత్యేకించి ప్రకటన చేసేవారు.
యథార్థం పొన్నుసామి పిళ్ళయ్ కి మదురై బాలగాన సభ అనే సంస్థ ఉండేది. ఈ సభా తరఫునే అప్పట్లో ప్రముఖ నటుడు వి.కె. రామసామి నటిస్తుండేవారు.
తిరుపత్తూరులో యుద్ధ నిధికోసం నాటకం ప్రదర్శించినప్పుడు వారి నాటకానికి అంతగా ఆదరణ లభించలేదు. దాంతో వి.కె. రామసామి, టి.కె. రామచంద్రన్ తిరుచ్చి వెళ్ళి బాషాను కలిసారు. తమ పరిస్థితి చెప్పి నాటకం మధ్యలో మీ హార్మోనియం కచ్చేరీ జరగాలి అని విన్నవించుకున్నారు. 
"యుద్ధ నిధికోసం నాటకం ప్రదర్శిస్తున్నారా....అయితే తప్పకుండా వస్తాను...లాభం వస్తే వేతనం ఇవ్వండి. లేదంటే రానుపోను ఖర్చులకు డబ్బులిస్తే చాలు" అన్నారు బాషా.
 
ఆయన ఒప్పుకున్న తర్వాత నాటకం మధ్యలో చక్రవర్తి హార్మోనియం ఖాదర్ బాషా కచ్చేరీ ఉంటుంది అని ప్రకటించారు. ఈ విషయాన్ని వి.కె. రామసామి తన పుస్తకంలో రాసుకున్నారు.
ఖాదర్ బాషా పాటలలో దేశభక్తి ఎక్కువగా ఉండేది. ఇస్లామ్ పాటలు పాడుతుండేవారు. హిందూ ముస్లిం మధ్య ఐక్యత కోసం ఆయన ఎక్కువ పాటలు పాడేవారు. 
భాస్కరదాసు, సూలై మాణిక్యనాయగం ఖాదర్ బాషాకు పాటలు రాసిచ్చేవారు.పాటలు రాసిచ్చేవారికి బాషా డబ్బులిచ్చే పద్ధతిని వాడుకలోకి తీసుకొచ్చింది బాషానే.
 ఒక పాటకు పది రూపాయలు ఇచ్చేవారు. ఆరోజుల్లో ఓ సవరం బంగారం ధర ఆరు రూపాయలు.
1930 దశకం బాషా యుగమే. ఆయన డెబ్బై పాటలను హెచ్.ఎం.వి. వారు గ్రామఫోన్ రికార్డులుగా విడుదల చేసారు.కానీ అవేవీ ఇప్పుడు అందుబాటులో లేవు.
శ్రీలంక, మలేసియా దేశాలలో పర్యటించిన బాషా దేశ స్వాతంత్ర్యంకోసం పాటలు పాడటంతో బ్రిటీష్ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. అయితే ఆయనకు విధించిన జరిమానాను ఎస్. వి. సుబ్బయ్య, ఎం.కె. త్యాగరాజ భాగవతార్ కట్టడొనికి ముందుకొచ్చారు. కానీ అందుకాయన ఒప్పుకోలేదు. దాంతో ఆరు నెలలపాటు జైల్లోనే ఉండి ఆ తర్వాత విడుదల అయ్యారు.
ఖాదర్ బాషా చివరి రోజుల్లో బ్రిటీష్ ప్రభుత్వం ఆయనపై హత్యానేరం మోపి జైలుకు తరలించింది. ఈ కేసు చివర్లో ఆయనకు ఉరిశిక్ష విధించారు. ఆయనను ఉరి తీసే ముందర మీ చివరి కోరిక ఏమిటని అడగ్గా "హార్మోనియం వాయిస్తూ పాడాలని ఉంది" అన్నారు. జైలు అధికారులు అందుకు ఒప్పుకున్నారు. ఆయన పాడుతూ హార్మోనియం వాయిస్తుంటే జైలు సిబ్బంది మైమరచిపోయారు. ఇంతలో ఆయనను ఉరి తీయవలసిన సమయం తప్పిపోయింది. ఉరితీయవలసిన వారికి ఓ టైమ్ నిర్దేశించేవారు. సరిగ్గా ఆ టైముకే ఉరితీయాలి. ఒకవేళ ఆ సమయానికి తీయకుంటే ఇక ఉరి తీసే వీలు లేదు. ఈ నిబంధనతో బాషాను ఉరితీయలేదు. అయినా తుదిశ్వాసవరకూ ఆయన జైల్లోనే గడిపారని సమాచారం. కానీ ఇందుకు సంబంధించి అధికారపూర్వక సమాచారమేమీ లేదు. ఏదో ఏమైనా ఖాదర్ బాషా ఓ గొప్ప కళాకారూడు అనేది యథార్థం.
కామెంట్‌లు