నీవుండాలి;-ఆకుమళ్ల కృష్ణదాస్;-కలం స్నేహం
ఓ మగువా! నీవుండాలి
ఓ మహిళా!నీవుండాలి
మహీ మండలానికి మణిమయ కిరీటంలా
నీవుండాలి!
ఒక అమ్మగా..అమ్మాయిగా
చెల్లెలుగా.. చెలియగా
సహచరిగా.. సహధర్మ చారిణిగా
తప్పకుండా నీవుండాలి!
పసికూనలకు గర్భకోటలా..పాలచెలిమలా నీవుండాలి!
కష్టాలకు వ్యవకలనం లా
సంతోషాలకు సంకలనంలా
పుడమితల్లికి పచ్చల హారంలా
బాధలకు బాగహారంలా
ఉలికిపాటు.. ఊగిసలాట లేని వారధిలా నీవుండాలి!
సెలయేటి పక్కన సేద తీరాలన్నా
పరిమళ పాలవెన్నెల్లో పయనించాలన్నా
ప్రకృతిని పలుకరించాలన్నా
పైరగాలికి పరవశించాలన్నా నీవుండాలి!
తినగలిగినంత తీపిగా
దండించే కారంలా
వగరు గలిసిన పొగరులా
లావణ్య రుచిగల లవణం లా
షడ్రసోపేత  హృదయంలా నీవుండాలి!
మానవాళి మనుగడకు మూలమై
మదాంధకారుల పాలిట త్రిశూలమై
విరినవ్వుల పరిమళాల సమూహమై
శుభోదయ వేళ సుప్రభాతమై
నీవుండాలి! నీవై ఉండాలి!!
 

కామెంట్‌లు