నాదస్వరానికి చిరునామా --నరసింగపేట్టయ్!;-- యామిజాల జగదీశ్
 "నేను పలు చోట్ల కొన్న నాదస్వరాలను వాయించాను. కానీ ఏ నాదస్వరమూ శుద్ధ మధ్యమం" రాగానికి సరిపోయేది కాదు. అయితే నరసింగపేట్టయ్ లో నాద్వరం తయారుచేసే వారున్నారు. తమిళనాడులోని తిరువావుడుదురై నుంచి అర కిలో మీటర్ దూరంలో నరసింగపేట్టయ్ ఉంది. చెన్నై నుంచి 275 కిలోమీటర్ల దూరంలో ఉందీ నరసింగపేట్టయ్. ఈ ఊళ్ళో నాదస్వరాల తయారీలో ఎన్.జి.ఎన్. రంగనాథ ఆచారికో ప్రత్యేక స్థానముంది. ఆయన ఆరు రంధ్రాల నాదస్వరాన్ని ఇచ్చారు. ఈ నాదస్వరంతో నేననుకున్న రాగాన్ని అద్భుతంగా వాయించగలిగాను. ఈ నాదస్వర తయారీదారు రంగనాథుడి ప్రావీణ్యాన్ని గుర్తించమని తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను" అని మెచ్చుకున్న నాదస్వర విద్వాంసుడి పేరు టి.ఎన్. రాజరత్నం పిళ్ళయ్. రాజరత్నం పిళ్ళయ్ సూచన మేరకు తయారు చేసిన ఆ నాదస్వరం పేరు పారి నాదస్వరం!
రాజరత్నం పిళ్ళయ్ స్వయంగా రాసిచ్చిన ప్రశంసాలేఖను రంగనాథన్ ఆచారి ఫ్రేమ్ కట్టి ఇంట భద్రంగా దాచారు. ఈ లేఖ ఎంతో విలువైనదని రంగనాథ ఆచారి కుటుంబం చెప్పుకుంటుంది.
రంగనాథ ఆచారి మరణం తర్వాత ఆయన కొడుకు, మనవళ్ళు ఈ నాదస్వరాలతయారీ వృత్తిని కొనసాగిస్తున్నారు.
నరసింగపేట్టయ్ లో ప్రస్తుతం నాలుగు కుటుంబాలవారు నాదస్వరాలను తయారు చేస్తున్నారు. వీరి పెరట్లో నాదస్వరతయారీకి కావలసిన ముడిపదార్థాలు, దుంగలు వంటివి క్రమపద్ధతిలో పేర్చబడి ఉంటాయి. 
ప్రతిరోజూ ఉదయం పది గంటలకల్లా ఈ కుటుంబాలవారు నాదస్వరాల తయారీ మొదలుపెడతారు. ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరిద్దరు సహాయకులుంటారు. 
సెల్వరాజ్ అనే అతను మాట్లాడుతూ నాదస్వరం లేనిదే తమిళ వివాహాలు జరగవు. అలాగే ఆలయాలలో ఉత్సవాలకు నాదస్వర వాయిద్యం తప్పనిసరిగా ఉంటుందన్నారు. మంగళకరమయిన వాయిద్యాలలో నాదస్వరమొకటి. 
సెల్వరాజ్ తండ్రి రంగనాథ ఆచారి 1955లో నాదస్వర తయారీలో ఓ కొత్తదనం తీసుకొచ్చారు.
శాస్త్రీయ నామం అయిన Arduvica finnetta చెట్ల దుంగలతో ఈ నాదస్వరాలు తయారవుతాయి. ఆకుపచ్చ కలపను ఉపయోగిస్తారు. ఈ చెట్టు వయస్సు కనీసం 75-100 సంవత్సరాలు ఉండాలి. 
ఒక్కో నాదస్వరం తయారుచేయడంలో ముగ్గురు వ్యక్తులు తమపనితనాన్ని ప్రదర్శిస్తారు. ఈ నాదస్వరం ఖరీదు అయిదు వేలు.
సెల్వరాజ్ మామ శక్తివేల్ ఆచారికూడా నాదస్వరాలు తయారుచేస్తారు.
సెల్వరాజ్ పెద్దకుమారుడు సతీష్ వాహనాలు నడపడం, వ్యవసాయం చేస్తుంటారు. 
 సతీష్ అత్తమామలు, అక్కచెల్లెళ్లు, తల్లి శాంతికూడా నాదస్వరం తయారుచేయడంలో నిమగ్నమవడంతో సతీష్ వ్యవసాయం చూసుకుంటున్నారు. 
 శక్తివేల్ కుమారుడు సెందిల్‌కుమార్ కూడా పదిహేనేళ్ల నుంచి నాదస్వరాలను తయారు చేస్తున్నారు. వీటి తయారీలో యంత్రాలను ఉపయోగించడం మొదలుపెట్టాడు సెందిల్ కుమార్. వీరి వర్క్‌షాప్‌లో జనరేటర్, హార్స్‌పవర్ మోటార్‌పై నడుస్తున్న లేథ్ మిషన్ ఉన్నాయి. ఒకానొకప్పుడు నాదస్వరాన్ని చేత్తోనే తయారు చేసేవారు. అయితే నాలుగో తరంవారు మిషన్లను వినియోగించడం మొదలుపెట్టారు.
తమ పరిశ్రమ కొనడానికి కలప విషయంలో గిట్టుబాటు ధర కల్పించాలని, వృద్ధ కళాకారులకు పింఛన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నాదస్వర కుటుంబాల విజ్ఞప్తి చేశాయి.
కామెంట్‌లు