మకుటం లేని మహారాజు;---కవిరత్న నాశబోయిన నరసింహ(నాన), ఆరోగ్య పర్యవేక్షకుడు,NVBDCP సబ్ యూనిట్ సికింద్రాబాద్, 8555010108.
మట్టిలో పుట్టి మట్టిలో కలిసే దాకా 
ధరణితో చెలిమిచేసే మకుటంలేని మహారాజు 
పల్లెతల్లిని పరవశింప చేసే భూమి పుత్రుడు
హలం ఆయుధంగా కష్టం సాగులో యుద్ద సైనికుడు!

పుడమి తల్లిని ప్రేమతో ఆరాధిస్తూ 
వ్యవసాయ యజ్ఞంలో అతనో సమిధ 
అన్నార్తుల ఆకలి తీర్చే ఆపద్బాంధవుడు 
అహరహం విరామ మెరుగని విశ్వరక్షకుడు! 

తిండీ తిప్పలు వదలి ప్రకృతితో మమేకమై
అలుపెరుగని నిత్య కృషీవలుడు 
నేలతల్లి కడుపులో పసిడి పండించి
మానవాళికి గోరు ముద్దలందించే మట్టిమనిషి! 

కాలమెంత కన్నెర్ర చేసినా గుండె నిబ్బరంతో
సేద్యం వదలని అపర భగీరథుడు 
అతని పాదస్పర్శకు పులకరించే భూమి
పొద్దంతా సూరీడుతో పోటీపడే శ్రమయోగి!

పంట చేతికొచ్చే దాకా ప్రాణాలు అరచేతిలో  
కంటిరెప్పలా పంటకు కాపలా దారుడు
రోగం రొప్పీ మరిచి కష్టించే కర్మయోగి కర్షకుడు 
రైతు లేనిదే రాజ్యం లేదు ఆదుకుందాం!అభయమిద్దాం !



కామెంట్‌లు