పట్టపగలూ - నడిరేయీ
ఎప్పుడైతేనేం?
రహదారికి దాహార్తి తీరదు!
తండ్రీ తనయుల అన్నా చిన్న
అనుబంధాలు తెగిపోతున్నయ్!
జ్ఞాపకాల వేకువ రేఖలు
మసకబారుతున్నయ్
అరక్షణం ఆదమరిస్తే
ఆనందం అవిటితనమే
అన్వేషించిన కొద్దీ
పొరపాట్లు వెంటాడుతుంటయ్!
నిర్వేదంగా - నిర్లిప్తంగా
మూగ శవాల అశ్రునివాళి సాక్షిగా
హైస్పీడు ముఖం చాటేస్తోంది
రక్తపు డాంబర్ తో,
ఎరుపెక్కిన రహదారిని చూసి
అనాధ గొంతుకల ఆర్తనాదం
దట్టమైన ఆర్ధ్రతా మబ్బుల ఆకాశం
పక్క వాహనం దాటి
మీసాలు మెలేసి
నిదానమే ప్రధానమని మరిచి
గమ్యం స్వల్ప కాలం చేరాలనే తపన
రోడ్డు ప్రమాదం బతుకు అగమ్యగోచరం !
క్రాసింగ్ లు - కార్నర్లు
సింగిల్ వే సిగ్నల్ పాయింట్లు
జీబ్రా గీతల జిగిబిగిలో
మద్యం మత్తు డ్రైవింగ్ తో
గమ్మత్తుగా స్టీరింగ్ విన్యాసానికి
సైకొట్టే వాహన చోదకులారా!
వందలాది ప్రాణాలు మీ అర చేతుల్లో నిక్షిప్తం
జీవన పయనం జర భద్రం!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి