*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౩౨ - 032)*
 *అర్ధ పద్ధతి*
ఉత్పలమాల:
*జాతి దొలంగుఁగాత గుణ శక్తి రసాతలసీమకుం జనుం*
*గాత కులంబు బూది యగుఁగాత నగంబుననుండి శీలముం*
*బాతముఁ జెందుఁగాత బహు భంగుల విత్తమె మాకు మేలు వి*
*ఖ్యాతగుణంబు లెల్లఁదృణకల్పము లొక్కధనంబు లేవడిన్*
*తా:*
కులము నశించి పోవచ్చు. మంచి గుణములు అన్నీ పాతాళ లోకంలోకి పడిపోవచ్చు. వంశము బూడిద అయిపోవచ్చు. తన శీలము ఎత్తైన కొండల మీద నుండి జారి అధః పాతాళానికి పడిపోవచ్చు. ఏమి జరిగినా సరే మాకు డబ్బే ముఖ్యము. డబ్బు ముందు ఎన్ని గొప్ప లక్షణాలైన గడ్డి పోచతో సమానము........ అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*ఈ పద్యం లో కవి డబ్బు, డబ్బు మాత్రమే ముఖ్యము అనుకుని జీవించే మనిషి ఆలోచనా విధానాన్ని చెప్పారు. పెద్ద వారు ఎప్పుడో చెప్పారు కదా, "ధనమూలం ఇదం జగత్" అని. ఈ మాట చెప్పిన వాళ్ళే, "ధనలక్ష్మి ని అదుపులోన పెట్టిన వాడే, గుణవంతుడు, బలవంతుడు, ధనవంతుడు" అని  కూడా చెప్పారు. జీవించడానికి డబ్బు అవసరమే. డబ్బే జీవితం కాకూడదు. రోజూ పంచభక్ష్య పరమాన్నాలు తిని తృప్తిగా వుండ లేని వారు, పట్టు పరుపుల మీద పడుకున్నా, నిద్ర రాదు. అదే, పచ్చి గంజిలో పచ్చి మిరపకాయ, ఉల్లపాయతో తరివేణి తిని, నేల మీద పడుకున్న వాడు తృప్తి గా హాయిగా సుఖనిద్ర పోతాడు. తృప్తి మనసులో వున్నప్పుడు, ధనం లేక పోయినా సంతోషంగా హాయిగా వుంటారు. అందరికీ సమధిక తృప్తి తో బ్రతికే అవకాశం ఆ పరమశివుని ఆశీస్సులు మన అందరికీ కలిగించాలి అని వేడుకుంటూ.... .*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు