*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౪౮ - 048)*
 *దుర్జన పద్ధతి*
ఉత్పలమాల:
*మౌనముచేత మూఁగయు, స మంచితవక్త ప్రలాపి, చెంగటం*
*బూనివసింప దిట్ట దమముందట దవ్వుగ నుండెనేని శా*
*లీనుఁడు దాల్మి భీరుఁ, డవలిప్తుఁడు దాలిమి లేనిబంటు, భూ*
*జానులసేవ దుష్కరమ సాధ్యము యోగులకైన నిద్దరన్.*
*తా:*
రాజుల వద్ద, అధికారుల వద్ద వుండే వ్యక్తి, ఏ విషయం పైనా మాట్లాడకపోతే మూగవాడంటారు. మంచి మాటలు చెప్పే వానిని వదరుబోతు అంటారు. తమ దగ్గరగా వుంటూ పనులు చక్కబెట్టే వారిని భయభక్తులు లేనివారు అంటారు. దూరములో వుంటే చేతకాని వారు అంటారు. ఓర్పు తో వ్యవహారం చేసే వానిని పిరికివారు అంటారు. ఇటువంటి పద్దతులు పాటించే రాజులు, అధికారుల వద్ద చేయడానికి యోగులకు కూడా సాధ్యము కాదు........ అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*"ఎగదీస్తే బ్రహ్మ హత్య. దిగదీస్తే గోహత్య." ఇది మనం మన చిన్నతనం నుండి వింటున్న నానుడి. "రెండు వేస్తే ఎక్కువ, ఒకటి వేస్తే తక్కువ".  " కోడుగుడ్డు మీద ఈకలు పీకడం".  ఇటువంటి పరిస్థితులలో పని చేయడం చాలా కష్టం. మనకు ఈ పరిస్థితులలో "విదుర మాహాశయులు" గుర్తు కు వస్తారు. కురు సభలో జరుగుతున్న అవక తవకల మధ్య ఇమడలేక పాలనా వ్యవహారాల తో సంబంధం లేని జీవితాన్ని గడిపారు. అందువల్లనే, రాయబారానికి వచ్చిన కృష్ణ పరమాత్మ తన విడిదిగా విదుర మహాశయుల ఇల్లును ఎంచుకున్నారు. ఇటువంటి విపత్కర మైన పరిస్థితులు మనం ఎదుర్కున వలసిన అవసరం రాకుండా ఆ పరాత్పరుడు మనలను  అనుగ్రహించాలని ముకుళిత హస్తాలతో, నిర్మలమైన మనస్సుతో ప్రార్థిస్తూ ..... .*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు