*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ప్రథమ (సృష్టి) ఖండము - (౭౧ - 71)*
*శివుని మాయలో వున్న నారదముని, తాను తన తపశ్శక్తితో మాత్రమే మదనుని గెలిచాను అని త్రికరణ శుద్ధిగా నమ్మి, కైలసమును చేరుకొని, తన విజయగాధను సవివరంగా మహాశివునుకి, పిదప బ్రహ్మలోకంలో బ్రహ్మ దేవునికి చెపుతాడు. కానీ, శివమాయాచ్ఛాదితుడు అయిన కారణంగా వారి హితవచనాలను పెడచెవిన పెడతాడు.  విష్ణుదేవుని కలవడానికి, తన విజయగాధ వివరించడానుకి విష్ణులోకము బయలుదేరాడు.*
*నారద మునిని చూచిన విష్ణుమూర్తి, తన ప్రియ భక్తడు వచ్చాడని ఎంతో ఆదరముతో ఎదురేగి సాదరంగా ఆహ్వానం పలుకుతాడు. విష్ణు దేవుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపి కదా. అందువల్ల నారదముని రాకకు కారణము ఊహించగలిగాడు. కానీ, నటన సూత్రధారి, నారదుని ఉచిత ఆసనమున కూర్చుండ చేసి, " నీవు ఎక్కడ నుండి వస్తున్నావు. నీవు రావడం వల్ల మాగృహము, మేము కూడా పావనులము అయ్యాము. నీ రాకకు కారణమేమి" అని అనుగ్రహ వాక్యాలు పలికారు.*
*ఇప్పటి వరకూ, శివుని మాయలో వున్న నారదముని కి, విష్ణుమూర్తి ఆదరణ కారణంగా, విష్ణు మాయ కూడా తోడు అయ్యింది. ఇంకే ముంది, తానే గొప్ప అనే గర్వంతో కూడిన భావన భక్తి మీద గెలుపు సాధించింది. మళ్ళీ మన్మధునిపై తన విజయ గాథను సవివరంగా విష్ణుమూర్తి కి తెలియ పరిచాడు. కానీ, కంసారి, నారదముని చెప్పే విజయం అతని కాదని, ఆ విజయానికి అసలు కారణం, మహేశ్వర ప్రభావంవల్ల కలిగినది అని తెలుసుకున్నారు.  అయినా, తన ప్రియ భక్తుని చిన్నబుచ్చకుండా, "నువ్వు మహా యోగివి. తపో నిధివి. మనసు లో భక్తి, జ్ఞాన, వైరాగ్యం లేని వారిని కామ మోహాది వికారములు తొందరగా తేలికగా ఆవహిస్తాయి. కానీ, నీ వంటి మునీశ్వరుని మన్మదాదులు ఏముచేయగలరు. నువ్వు పుట్టుకతోనే బ్రహ్మచారివి. నీకు కామ క్రోధాదులు కలిగే అవకాశం లేదు." అని అన్నారు.*
*పైమాటలు స్వామి నారాయణుడు పలుకుతున్నంత సేపు, నారదముని మనసారా, పెద్దగా నవ్వుకుంటూనే వున్నాడు. తరువాత, నారాయణ మూర్తి కి నమస్కరించి, నారదమహర్షి తన ఇచ్చవచ్చిన చోటికి ప్రయాణంపై బయలుదేరాడు.*
                                       
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు