*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ప్రథమ (సృష్టి) ఖండము - (౭౩ - 73)*
 *మాయా నిర్మిత నగరము - శీలనిధి కుమార్తె - విష్ణుమూర్తి రూపము - భగవంతుని వరించుట - శివగణములకు శాపము*
*శీలనిధి మహారాజు రాజ్యంలో ఆ మహారాజు కుమార్తె శ్రీమతిని చూచి నారదముని ఆమె భవిష్యత్తు చెప్పి వెంటనే విష్ణలోకానికి పయనమౌతాడు.*
* విష్ణు లోకము చేరిన నారదముని, భగవానుని అనేక విధముల కీర్తించి, తాను శీలనిధి మహారాజు కుమార్తె శ్రీమతి ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. ఆమె, సర్వలక్షణ సమన్విత. విశ్వమోహిని రూపములో వుంది. మూడు లోకములలో అంతటి సుందరవతిని నేను చూడలేదు. ఆమెను నేను వివాహ మాడాలి.  భగవాన్ నేను నీ భక్తులలో అగ్రగణ్యుడను. ముఖ్యమైన వాడను. నీకు ప్రియమైన వాడను. కనుక నాకోరిక మన్నించి నాకు నీ సుందర రూపము అనగ్రహించు, స్వామీ. అప్పుడు శ్రీమతి నన్ను తప్పక వివాహమాడుతుంది. మీరు నాకోరిక తప్పక తీర్చ వలసింది,అని ప్రార్ధించాడు*
*పరాత్పరుని కి తెలిసిన విషయమే కదా, నారదముని శివ మాయలో వున్నాడని. అందువల్ల, నారదా, నిస్సందేహంగా నీవు నా భక్తులలో అగ్రగణ్యుడవు మరియు ప్రియమైన వాడివి. నీ కోరిక తప్పక తీరుస్తాను, నీకు మంచి జరిగే విధంగా.  ఇలా పలికిన పరమాత్మ, నారదునికి వానర ముఖముతో తన శరీరమును అనుగ్రహించాడు.  పిదప, నారదముని ని తన అభీష్టము ఎచ్చటో ఆచోటికి వెళ్ళమని చెప్పి అంతర్ధానం అయ్యాడు. నారదునకు, ఇప్పటికీ తెలియని విషయం, తనకు వానర ముఖముతో విష్ణు భగవానుని రూపం వచ్చింది అని.*
*నారదముని వెంటనే, శీలనిధి మహారాజు సభా మందిరము చేరుకుంటాడు. ఆ మందిరములో ఎంతో మంది రాజులు వచ్చి స్వయంవరం కోసం వేచివున్నారు. అప్పుడు ఆ సభ ఇంద్ర సభని తలపించింది. నారదముని తనకు లభించిన సుందర రూపాన్ని తలచుకుంటూ, శ్రీమతి తననే వరిస్తుంది అనే ఊహలలో తేలిపోతున్నాడు. మహాశివుడు దయాళువు కదా. అందువల్ల తన ఇద్దరు పార్షదులను నారదముని కి రక్షణగా పంపిస్తాడు. ఆ ఇద్దరు శివ పార్షదులూ, బ్రాహ్మణ రూపాలలో, నారదముని ప్రక్కన కూర్చుని వుంటారు. వారిద్దరికీ, నారదముని పూర్వ రూపము తెలుసు. ఇప్పుడు వున్న రూపము విష్ణుమాయ ప్రేరితము అని కూడా తెలుసు. ఈ శివ పార్షదులు, నారదముని కి సత్యము తెలపాలని ఆతనిని అవహేళన చేస్తుంటారు, కానీ, మోహావేశంలో వున్న నారదముని, వారి మాటలలోని నిజాన్ని గ్రహించలేక పోతాడు.*
*ఇంతలో, తామరతూడులను పోలి, సువర్ణ కంకణాలతో వెలుగుతున్న తన హస్తాలలో వరమాల ధరించి, దేవతాలోక సౌందర్యాన్ని సొంతం చేసుకున్న శ్రీమతి సభా మందిరం లోకి వచ్చింది. శీలనిధి మహారాజు వచ్చిన రాకుమారులను పరిచయం చేసిన తరువాత, శ్రీమతి వరాన్వేషణకు సభా మందిరంలో ఒక్కొక్క వరుసలో వున్న వారినందరినీ చూచి తనకు యోగ్యమైన వారు ఎవరూ లేరు అనుకుంటూ, అక్కడే వానర ముఖంతో సౌదర్యవంతమైన శరీరంతో వున్న నారదముని ని చూచి కూడా చూడనట్టుగానే సభా మధ్యలో నిలబడుతుంది. అప్పుడు విష్ణుమూర్తి, ఒక సుందరమైన క్షత్రియ రాజు వేషంలో వచ్చాడు. కానీ, అలా వచ్చిన విష్ణుమూర్తి శ్రీమతి కి మాత్రమే కనిపిస్తాడు. చూచిన వెంటనే, రెప్పపాటు కాలం కూడా ఆలోచించ కుండా, వరమాల ఆ క్షత్రియుని మెడలో వేస్తుంది.  ఆ వెంటనే విష్ణు భగవానుడు, శ్రీమతి తో కలసి తన విష్ణులోకానికి అంతర్ధానం అవుతాడు.*
                                       
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు