పల్లె మనసు; -నెల్లుట్ల సునీతఖమ్మం7989460657
పసిడివెలుగులు రాశిపోసిన హరితవనమే చిత్రమంతా !!
రంగుపూవులు‌ వెల్లివిరిసిన పూలసంచే చిత్రమంతా !!

కంటిపాపకు హాయిగొలిపే రంగురంగుల పల్లెసీమలు
అవనిపాపకు హాయినిచ్చిన పల్లెసొగసే చిత్రమంతా !!

జగతినిండుగ జగముపండుగ నిండివుండిరి మహితమూర్తులు
ప్రేమధారకు మమతలద్దిన నిండుమనసే చిత్రమంతా !!

కష్టజీవుల సొగసుపందిరి విరగబూసిన పంటభూములు
చెమటచుక్కలు రంగరించిన పల్లెపడుచే చిత్రమంతా !!

త్యాగధనులకు మచ్చుతునకలు మిన్నుతాకిన మన్నుమెరుపులు
స్నేహసుధయే వెల్లివిరిసిన మంచిమనిషే చిత్రమంతా !!

సిగనుముడిచిన బంతిపూవులు మనసునీతకు మెరుపుచుక్కలు
కొప్పుకొప్పున విరగబూసిన పచ్చపైరే చిత్రమంతా !!


కామెంట్‌లు