ఉగాది - స్థిత ప్రజ్ఞత ;-గడ్డం దేవీ ప్రసాద్ 89718 30473
గణనానికి అనుకూలంగా ఏర్పడిన 
కాలచక్రంలో మరో వత్సరం వచ్చింది 
శుభకృత్ నామధేయాన శుభకరముగ 

గున్న మామిడి తన ఆకులతో 
తోరణాలకు శోభను పెంచుతూ 
వగరు రుచికి పిందెలను తెచ్చింది 

మితిమీరిన చింతలు మానుమంటూ 
వంకరటింక వయ్యారియైన చింతను 
పులుపు రుచినిమిత్తం బహూకరించింది 

అతి అనర్థం అని తెలుపుతూ 
అదుపులో ఉండమని హెచ్చరిస్తూ 
నాలుకను చుర్రుమనిపిస్తుంది మిరప 

గానుగపళ్ళ మధ్య చిద్రమైనా ముదంతో 
తన రసాన్ని మధురమైన బెల్లంగా మార్చి 
తీపికి గుర్తుగా అందించింది చెరకు గడ 

నిలువెల్ల ఔషధీ గుణాలతో అలరారుతూ 
ఎన్నో రుగ్మతలను మటుమాయం చేసే వేప 
చిరుచేదుకు చిహ్నంగా తనపువ్వు నిచ్చింది 

ఇవన్నీ చూస్తూ సాగరుడు ఊరుకుంటాడా 
స్వచ్ఛ నిష్కపట హాసాలను స్ఫురించేలా 
శ్రేష్ఠ లవణ స్ఫటికాలను అందించాడు 

ప్రకృతిమాత షడ్రుచులను చూపిస్తూ 
జీవితంలో సుఖదుఃఖాల నన్నిటినీ 
సమానంగా స్వీకరించాలని బోధించింది 

ఆరు రుచులు అరిషడ్వర్గాలకు గుర్తులు 
వాటిని అదుపులో నుంచే వాడే స్థితప్రజ్ఞుడు 
ఉగాది మనకు ఇచ్చే మహత్తర సందేశం ఇది 

ఈ సందేశాన్ని తెలుపుతూ గండు కోయిల 
తన కుహూ కుహూ గీతాలాపనతో ఉగాదికి 
స్వాగతం  సంతుష్టాంతరంగయై 


కామెంట్‌లు