శుభకృన్నామ ఉగాది.-మౌళి--జయపురంఒడిశా
వహ్! నీ పేరులోనే శోభ ఉన్నది
ఉత్సుకతతో మా మానసమున్నది!
ఏ భవితను వడ్డించునోయని నీవీ యేడాది!
కొరోనా ఓ రక్తబీజుడే,
తనకు ఈ యేడాది పాడవలె మంగళగీతి!
అతివల మనమూ మానమూ 
శుభ్రజ్యోత్సలతో శోభిల్లజేయవలె 
నీవు శుభకృత్ నామ జననీ!
ఆకలిదప్పులు, ఆర్తనాదాలు 
కొట్టుకుపోవాలి నీ ఆగమనానందోత్సవ వేళ!
ఆరు రుచుల సమాహారమే జీవితమట!
మానసిక వికారాలు ఎన్నెన్ని, ఎక్కడి రుచులట?
తల్లీ నీవైనా ఓ పనిబట్టు వాటిని!
యుద్ధమేఘాలేనా అన్నిటా, అంతటా?
హరితమానసములను పూయించవమ్మా యిక మీదట!
తీపి తగ్గిననూ బాధలేదు,
చేదు జ్ఞాపకాలను మిగల్చకమ్మా!
చుక్కలకే చుక్కలు చూపిస్తున్నాయి ధరవరలు,
నేలపైన నడిపించమ్మా నీవైనా!
ఏ రైతూ నడిరోడ్డుపై నిరసనలతో నడయాడకుండా చూడమ్మా!
పుడమి నుండి అమానవీయ మతములను రూపుమాపుము తల్లీ!
మనిషిని మనిషిగా మననీయని మతమెందుకు?
మనిషికంటే మతం ముఖ్యమా మాకు?
మట్టికరిపించమ్మా మతమౌఢ్యాన్ని!
నీ అక్కలు మౌనంగా రోదిస్తూ,
మా తప్పిదాలకు మోములను దించుకున్నారు!
కాలంలో కలసిపోయారు!
తిరిగి రాలేని గతమైపోయారు!
వారి ఆత్మల కళ్ళల్లో ఆనందబాష్పాలు నీవైనా నింపమ్మా!
గంపెడు ఆశలతో ఎదురు చూస్తున్నా!
గుప్పెడైనా నవ్వులు మా మధ్య మెసలుతాయని!
అనుబంధాలూ, ఆత్మీయతలూ, మానవతలూ
ఇవే శాశ్వతాలు!
అని ఈ యాంత్రిక జీవులకు
నీవైన గీతోపదేశం చేయమ్మా!
ఎక్కువగా ఆశించం!
పంటి నిండా ఒక పూటైనా తిండి,
కంటి నిండా కలతలేని నిద్ర,
బ్రతకులో జీవించే భాగ్యం,
నువ్వైనా కరుణించమ్మా!

నీ రాక మాకు 
శుభాకాంక్షలందిస్తుందనే ఆశతో
ఓ సామాన్య జీవి!

స్వాగతం తల్లీ స్వాగతం!
💐💐💐💐💐కామెంట్‌లు