నానీల చినుకల్లో తడిశాను;-- యామిజాల జగదీశ్
 కొన్ని రోజుల క్రితం కృష్ణారావుగారనే మిత్రులు ఓ నాలుగు పుస్తకాలిచ్చారు. వాటిలో ఒకటి బి. గీతిక గారి 'నానీల చినుకులు" పుస్తకం. ఈ చిరు పుస్తకంలో నలబై మొత్తం నూట ఇరవై నానీలున్నాయి.
ఒకానొకప్పుడు హైకూలు వివిధ పత్రికలలో కనిపించేవి. తర్వాతి కాలంలో పుట్టుకొచ్చాయి నానీలనే పొట్టి కవితలు. ఈ నానీలకు సృష్టికర్త డా. ఎన్. గోపీ గారు. వీటి గురించి ఓ రెండు మాటలు తెలుసుకుందామని ముందుగా ఓ మూడు ప్రశ్నలు పంపాను. తర్వాత ఫోన్లో మాట్లాడాను. 
ఎక్కడున్నావు జగదీశ్...కళ్ళు మూసుకుని ఊహాలోకాల్లో ఉంటే ఎలా అంటూ నానీల గురించి క్లుప్తంగా చెప్పారు. 
నానీల కవితా ప్రక్రియకు ఆద్యులు గోపీగారే. 
నానీలంటే, తెలుగు సాహిత్యంలో నాలుగు పంక్తులలో మొత్తం 20 నుండి 25 అక్షరాలతో సాగే సూక్ష్మ కవితా పద్ధతి! చదవడంతోనే ఓ మెరుపు తళుక్కుమంటుంది కళ్ళముందు. అటువంటి ఈ కవితా ప్రక్రియను తెలుగు కవితా సాహిత్యంలో ప్రవేశపెట్టిన వారు ఎన్. గోపి గారు.
గోపీగారు అనేక నానీలు రాశారు. వాటిలో రెండు పుస్తకాల రూపేణా వచ్చాయి. ఒకటి నానీల సంపుటి శీర్షికతో. మరొకటి గోపీ నానీలు అనే శీర్షికతో. ఈ రెండు సంపుటులు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం వచ్చినవే. 
 వివిధ పత్రికల్లో రాసిన నానీలన్నీ
 ఇందులో వున్నాయి.ఈ తొలి సంపుటికి పాఠకలోకం నుంచి స్పందన బాగానే వచ్చింది. వీటిలో మొత్తం ఏడు వందలకుపైగా ఉన్నాయి నానీలు!
నానీలపైన పది మంది పరిశోధనలు చేసి పిహెచ్.డీలు పొందినట్టు, సుమారు పదిహేను భాషల్లో నానీలు  అనువాదాలకు నోచుకున్నట్టు చెప్పిన గోపిగారు రష్యన్ భాషలోనూ నానీల అనువాదం ఉందన్నప్పుడు ఆశ్చర్యం వేసింది. 
గోపీగారు చెప్పిన పుస్తకాలలో బి. గీతిక గారి నానీల చినుకులు ఒకటి. ఈ పుస్తకాన్ని రచయిత్రి గోపీగారికి, శ్రీమతి అరుణగారికి అంకితం చేశారు రచయిత్రి!
గీతిక గారి పుస్తకంలోని ఆఖరి నానీ...
"నానీల మర్రి 
విత్తనం పేరు గోపి
అనంతాలకి వ్యాపిస్తూ
ఊడలెన్నెన్నో"  
- ఈ మాట అక్షరసత్యం. 
 గోపి గారు వేసిన నానీల బాటలో బోలెడుమంది నడుస్తున్నారు. ఇప్పటికే నానీలకు సంబంధించి నాలుగు వందల పుస్తకాలొచ్చాయని, వాటిలో మూడు వందల తొంబై పుస్తకాలు తన పీఠికలతో వెలువడినట్టు గోపీగారు చెప్పారు. 
గీతిక గారికి గురుతుల్యులు గోపిగారు. నాన్నీల నాన్నగారన్న గీతిక గారి సంబోధన బాగుంది. 
బాగా రాసింది గోదావరి అమ్మాయి గీతిక అంటూ మెచ్చుకున్నారు గోపిగారు. 
"నిన్ను నానీల్ని వ్రాయమని చెప్పడం లేదు. కానీ వాటంతట అవే బయటపడితే....అవి వ్రాయాల్సిన విధానాన్ని గుర్తుంచుకో" అంటూ గోపీగారు గీతికగారికి నానీలకి ఉండాల్సిన లక్షణాలను వివరించారు. ఆ ప్రేరణే ఈ నానీల ప్రయత్నానికి కారణమైందటూ కవిత్వానికి దిక్సూచి అయిన శ్రీ డాక్టర్ యన్. గోపిగారికి, వారి శ్రీమతి అరుణగారికి ఈ పుస్తకాన్ని అంకితం చేసారిలా....
"నానీల చినుకులు
వర్షిస్తున్నాయ్
అంకితమంటూ
మీ పాదాలపై..!"
పవన్ కుమార్ గీసిన బొమ్మలతో ముస్తాబైన గీతికగారి నానీలలో మచ్చుకు కొన్ని....
1
ఉగ్గబట్టలేక
ఉబికిందో నీటిచుక్క
మింటినుంచా?
కంటినుంచా?
2
చెట్టు రుణం
ఎలా తీర్చేది?
కడుపు తిండికే కాదు
కాటికీ కట్టెలిచ్చింది!
3
ఆకాశం
ఓ వాటర్ ఫిల్టర్
ఉప్పునీటిని తీసుకుని
మంచినీరు ఇస్తోంది
4
చేనుది నాట్యమా?
కాదు, భయం!
గాలీవానలు
ముంచేస్తాయని!!
5
అక్షరాలూ
కొట్టివేతలకి పోటీ
పరిపూర్ణత కోసం
వాటికవే సాటి!
6
కడుపుకి ఆకలి
అన్నం అందింది
మనసు ఆకలి
పుస్తకమడిగింది
7
నీడలు
అందంగానే ఉన్నాయి
ఎలాగున్నాయో
వాటి వెనక నిజాలు!
8
ఆకాశం చెట్టుకి
మేఘం పండు
భళ్ళున పగిలిందా 
చినుకుల గింజలు
9
కవి ఒక చేత్తో
వ్రాసేవాడు
ఇప్పుడు రెండు చేతుల్తో
కీబోర్డు రాతలుగా!
చిన్న పిల్లల్తో ఆడుకుంటున్నంత ప్రశాంతంగా ఉండేదట నానీల మధ్య ఉన్నప్పుడు గీతికగారికి. అవి వ్రాస్తూ పొందిన అనుభూతి మాటల్లో వర్ణించలేనిదన్నారు.
ఏ కల్మషాలూ తెలీని బాల్యంలోకి వెళ్ళి అందులోని స్వచ్ఛతని ఆస్వాదించినంత ఆనందమది అన్న గీతికగారు నానీల తోటలోకి వేసిన తొలి అడుగు ఇది. కామెంట్‌లు