శివ స్మరణ ;-మచ్చ అనురాధ--యస్.ఏ.తెలుగు
ఉత్పలమాల పద్యాలు

అంతట నిండి యుంటివిల నంబ మనోహర నాదిదేవుడా! 
యెంతటి మాయ కారివయ , యేమని యందును  నిన్ను జూచినన్ 
చెంతన యుండె భక్తులను జేరియు గొల్వ మోదమొందవే 
మంతన మందు నింతయును మౌనము వీడక యుందువె ప్పుడున్  .

శూలము బట్టి శత్రువుల స్రుక్కడ గించెడిదేవ రుద్రుడా! 
కాలము దాల్చి కంఠమున గంగ జటాధర గౌరి వల్లభా! 
నీలపుకందరా! సుగుణ నిన్నిల మించిన దైవమేదిరా! 
యేలగ రావదేల శివ  యెన్నియొ పూజలు జేయుచుంటిరా! .

శంకర నిన్ను నమ్మి తిని శాంభవి  వల్లభ మోక్ష ప్రాప్తి కై 
తంకము జూపకుండనను దాపున జేర్చుము బోళ శంకరా!
పంకజ లోచనుండ కడు పావనమూర్తివి  పాహి పాహి ,నా
పంకము  బాపి శోకమును  పారగ జేయుము నీలకంధరా! .

ఎంతటివారికైననిల యీశ్వర నీపద సేవజేయగన్
చింతలు పారద్రోలెదవు జీవిత మంతయు  కాపుగాచియున్ 
వింతల   నెన్నియో కనుల వీక్షణ జేసి విరక్తి ‌నొందితిన్  
నంతము నందు  చేకొనియు  హాయిని  గూర్చెదవీవు శంకరా! .

జంగమ దేవరాయలన చంకన జోలెయు వేసుకొందువే 
లింగమ రూప శంకరుడ లీలలు తెల్యగ మాకు శక్యమే! 
గంగ మనోహరా!  హరుడ గావగ రమ్మిక  నాగభూషణా!
సంగమ రూప సాంబశివ సన్నుతి జేసెద నామనంబునన్ .
=====================
మచ్చ అనురాధ
యస్.ఏ.తెలుగు 
జి.ప.ఉ.పా.కుకునూర్ పల్లి, కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా.

కామెంట్‌లు