అక్షరాలతో వల్లువర్ రూపం;-- యామిజాల జగదీశ్
తమిళనాడులోని కాంచీపురం యువకుడొకడు క్రీస్తు శకం మూడవ శతాబ్దం నుంచి ఇప్పటి వరకూ ఉన్న తమిళ అక్షరాలతో ఓ అద్భుతం సాధించాడు. ఆప్పటి నుంచి ఇప్పటి వరకూ ఉన్న ఏడు వందల నలభై ఒక్క తమిళ అక్షరాలను ఉపయోగించి తిరువల్లువర్ రూపాన్ని చిత్రీకరించాడా యువకుడు. అతని కృషినీ కళను తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ మొదలుకుని ఎందరో ప్రశంసించారు.
కాంచీపురానికి సమీపంలోని పోన్నేరి తీరాన ఉన్న తమిళనాడు రవాణా కార్మికుల గృహసముదాయానికి చెందినవారే సుందర్ 
- ,మురుగమ్మాళ్ దంపతులు. వీరి కుమారుడైన గణేశ్ సివిల్ డిప్లొమా చదువుకుని ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు.
చిన్నట్పటి నుంచే బొమ్మలు గీయడంలో ఆసక్తి ఉన్న గణేశుకి తీరిక వేళల్లో పెన్సిలులో బొమ్మలు గీస్తుండటం అలవాటు. 
ఈ క్రమంలో గణేశ్ క్రీ.శ. మూడవ శతాబ్దం మొదలుకుని ఇప్పటివరకు తమిళ లిపిలో చోటు చేసుకున్న అక్షరమాలలోని వాటినన్నింటితో వల్లువర్ రూపాన్ని చిత్రించాడు.
ఈ చిత్రాన్ని తమిళనాడు ఎమ్మెల్యే ఉదయనోధి స్టాలిన్, విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ తదితరులు పోస్ట్ చేశారు. 
ఇది ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించింది. అది తనకూ నచ్చి స్టాలిన్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు.
 
ప్రేమతోనే ఉన్నతస్థితి ఆనే వల్లువరుని తమిళంమీది ప్రియత్వంతో ఈ చిత్రఖండాన్ని సృష్టించిన గణేశ్ ప్రతిభను కొనియాడుతున్నారు చూసిన ప్రతి ఒక్కరూ.
వల్లువర్ సాహిత్యమైన తిరుక్కురళ్ ఎట్టాగైతే రెండు వేల సంవత్సరాలుగా తమిళులకు దక్షిణ వేదమై కొనసాగుతోందో అట్లానే గణేశ్ ఆలోచనలో పుట్టుకొచ్చిన అక్షరాలతో వల్లువర్ చిత్రంకూడా తమిళ భాష ఉన్నంత కాలమూ ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.
వల్లువరుని తమిళులు కవిగా తత్త్వవేత్తగా గుర్తించి కీర్తిస్తారు. వల్లువర్ తన తిరుక్కురళ్ ద్వారా సమాజానికి చెప్పిన నీతివాక్యాలన్నీ అమూల్యమైవి. 1330 ద్విపదలతో కూడిన ఉత్కృష్టమైన రచనే కురళ్. వీటిని శ్రీసూక్తులుగా పరిగణించేవారున్నారు. తెలుగువారికి వేమన శతకం ఎట్టాగో తమిళులకు తిరుక్కురళ్ అట్లాంటిది. అందుకే వల్లువరు స్మృత్యర్థం  తమిళనాడులో అనేక ప్రాంతాలలో విగ్రహాలున్నాయి. స్మారక మందిరాలున్నాయి. రవాణా శాఖలో ఓ విభాగానికి ఆయన పేరు పెట్టారు. మద్రాసులోని నుంగంబాక్కంలోని వల్లువర్ కోట్టం, కన్యాకుమారిలో నూట ముప్పై మూడు అడుగుల వల్లువర్ విగ్రహం దర్శనీయమైనవి. వల్లువర్ కోట్టం 1976 లో నిర్మితమైతే కన్యాకుమారిలో వల్లువర్ విగ్రహాన్ని 2000 జనవరి ఒకటో తేదీన ఆవిష్కరిం చారు. అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం కలిసేచోట ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ 133 అడుగులు విగ్రహం వల్లువర్ తిరుక్కురళ్ లోని 133 అధ్యాయాలను  సూచిస్తాయి. ఈ విగ్రహాన్ని తమిళనాడుకు చెందిన ఆలయ వాస్తుశిల్పి వి. గణపతి స్థపతి రూపొందించారు. తమిళనాడు ప్రభుత్వం ప్రతి జనవరి పదిహేనో తేదీని ఆయన గౌరవార్థం తిరువల్లువర్ దినోత్సవంగా జరుపుకుంటుంది.
ఇక వల్లువర్  రచనలు దక్షిణ భారత శాస్త్రీయ సంగీత కళాకారులనూ ప్రభావితం చేశాయి.
స్వరకర్తలు మయూరం విశ్వనాథ శాస్త్రి, ఎం.ఎం. దండపాని దేశికర్ వల్లువర్ ద్విపదలను స్వరపరిచారు. ఇక చిత్రవీణ ఎన్. రవికిరణ్ నూట అరవై తొమ్మిది భారతీయ రాగాలతో  1330 ద్విపదలకు సంగీతాన్ని సమకూర్చడం విశేషం. కామెంట్‌లు