ఓ వసంతమా ; -వెంకటయ్య వంశ రాజు భాషా పండితులు చెంగోల్ తాండూర్ వికారాబాద్ జిల్లా; --వెంకట్ మొలక ప్రతినిధి:
ఓ వసంతమా నీకిదే మా                   
          వందనం
ఇంటి ఇరుకు గదుల మధ్య
పిల్లల కాకి గోలలు సవ్వడిలో 
కాలం వెళ్లదీస్తూన్నానని కానుగ చెట్టు నీడలో నిద్రపుచ్చి
కమ్మని కోకిల గానం వినిపించావు
ఓ వసంతమా నీకిదే మా                   
          వందనం
దాహం వేసి దారి తప్పిన బాటసారికి చెయ్యందించి
తాటి తొనల తీయని నీటినిచ్చి
తనివితీరా తాగించావు
ఓ వసంతమా నీకిదే మా                   
          వందనం
నిండా పచ్చని చీర కట్టి
ప్రకృతికి సరికొత్త ఆకృతి నిచ్చి
రేపటి మా బ్రతుకులకు భద్రతను
బాహాటంగానే చూపించావు
ఓ వసంతమా నీకిదే మా                   
          వందనం
 
నీలోని షడ్గుణాలను
మాకు షడ్రసోపేతంగా చేసి
కష్టసుఖాలను సమంగా  స్వీకరింపజేసి 
ఉగాదితో ఉషస్సులు నింపుతున్నావు 
ఓ వసంతమా నీకిదే మా                   
          వందనం🙏


కామెంట్‌లు