సకల శుభదాయని
శుభకృత్ ఉగాదిగా
ధరణిన దారుణాలు
దరి చేరకుండగా
తరలి రావే యమ్మ
పూర్ణ కుంభం తోడు
శాంతి కాంతులు పంచు
జగతి వెలుగంగా
పూల సొగసులన్ని
తరువు కుమ్మరించగా
వెలుగగా నేలంతా
వెల్లువై అరుదెంచు
కులమతంబుల భేదం
తుంచు దారులను పంచ
నయన మనోహరంగా
మానవులనెలిగించ
రోగ పీడల నణచ వేగంబు రావమ్మా సంజీవనై!
మహిలోన నిండిన
మత్తు వదిలించగా
నీ పాద మంజీర
రవంబులు మోగంగా!
రయ్యిమని రావమ్మా!
శాంతి కాంతులీడగా!
షడ్రుచుల మేళవం
తనువు నెలిగించగా
ఆయురారోగ్యాల
నిచ్చు సంజీవనిగా
యేడాది కొక్కరోజుమది
యెన్నెలలు పంచు కొత్త సాలై
వత్సరంబులలోన
వత్సనాభములు తెలిపి
అవని వెలుగుల కొరకు
జవ సత్వముల నిలిపి
శుభకృత్ రావమ్మా
తెలుగు జాతికి వెలుగై!
రహటులన్ని తరిమి
రమణీయముగ రావే
రహిపంచు జగమెంచి
పీడితుల కాంచవే
సకల పుణ్య పేఠి
పరమ పావని యుగాది
వగరు మామిడి చిగురు తిని
వయ్యారి కూజితంబు
తరువు శిగలో ముత్యం
పలికేను స్వాగతంబు
తీపి చెరకు గడ మిరియంపు
ఉప్పు పులుపులతో పులకరించంగా!
యుద్ద భీతి లేక
యవని వెలిగేలాగా!
అంతరాలు తూడ్చు
ఆనంద మందిరంగా!
ఆశీస్సులందించ అరుదెంచే
మాతల్లి స్వాగతంబు నీకు సకల కల్పవళ్ళీ!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి