పుస్తకం !!;-- తమిళంలో చదివిన కవిత -అనుసృజన ; జగదీశ్ యామిజాల
 పుస్తకం ఒకటి
చేతిలో లేని సాయంత్రాలు
చేతుల్లేని మనిషికి
లభించిన వీణలా
వృధా అవుతాయి!!


అక్షరాలతో గడిపి
తీసే కునుకు 
ఎంత హాయిగా ఉంటుందో!!


నన్ను 
నేనే కోల్పోవడానికి
ప్రయత్నించి
నన్ను నేనే కనుక్కోవడానికి
అడుగేసినప్పుడు
పుస్తకాలు మాత్రమే
కనులముందు సాక్షాత్కరిస్తాయి!!


మాటలలో పడి
పేజీలలో ఒదిగిపోయి
కవితలలో కరిగి
అనంతరం
బయటకు వచ్చినప్పుడు
తేజోమయమవుతాయి 
ఆకాశమూ మనసూ!!


పుస్తకాలు లేని గదులు
గాలిని బంధించేసిన
సమమాధుల్లాంటివే!!


పుస్తకాలు లేకుంటే
నేను 
శ్వాసించడం కుదరదని
ఆలోచించిన కాలాలున్నాయి!!


కానీ
ఇప్పుడు
మారిపోయాయి
స్థితిగతులు...
నేను
చివరగా చదివిన పత్రిక
"నా పెళ్ళి పత్రిక" అని జ్ఞాపకం!!
కామెంట్‌లు