శుభాల శుభకృతు;-ఆకుమళ్ల కృష్ణదాస్--నంద్యాల.
చైత్రమాస కుందనపు బొమ్మలా ముస్తాబై!
అరుదెంచుతోంది మన ఆనందాల యుగాది!
నూతన మంజీరాల సవ్వడులతో కథానాయికలా!
షడ్రుచుల పరిమళాలను వెంటేసుకొని!
ఆత్మీయుల ఆనందాలను ఆస్వాదించ!
తరలి వస్తోంది మురిపాల తరుణీమణి యై!
ప్రకృతి కన్య పలకరింపుల పులకరింపులతో!
మత్తు కోయిలల మధుర గానాలను శ్రావ్యంగా వింటూ!
పండి పోయిన'ప్లవ'వత్సరాన్ని పక్కకు జరుపుచూ!
ప్రత్యూష వేళనే పరిమళిస్తున్న పారిజాతమై!
బాల భానుడి పసిడి కిరణాలకు మురిసిపోతూ!
ఇంటి ముంగిలి ముగ్గులలో అడుగులిడుతూ!
స్వాగత మామిడి తోరణాలను సన్నగా స్పృశిస్తూ!
పసిబాలల కేరింతలకు సంబర పడుతూ!
ఉగాది పచ్చడిని ఊరందరికీ తినిపించ!
పంచాంగ శ్రవణమై ఫలములను కురిపించ!
సంస్కృతీ సాంప్రదాయాలు మకుటాయ మానమై!
పేరులోని శుభాలను మనందరికీ ప్రసాదించ !
రావమ్మా!మా"శుభకృతు"నామ ఉగాది!
నీ రాకతో పులకించాలి.. మా అందరి మది గది!!కామెంట్‌లు