శుభాల రాగమయీ ;-ఎం. వి. ఉమాదేవి
  తాజా గజల్ 

 కాలజలధి తరంగాల నాదమయీ శుభకృతూ 
జీవఘటన చేతనాల హాసమయీ శుభకృతూ 

శిశిరానికి వీడుకోలు చిగురులతో తరువువెలిగె 
యుగయుగాల ప్రకృతిలోను తేజమయీ శుభకృతూ 

అరవై సంవత్సరాల చక్రగతిని అనుసరించె
కుదురై నిలిచినగతాల ధ్యానమయీ శుభకృతూ 

తెలుగువారి తొలిపండుగ మామిడాకు తోరణాలు 
చేమంతులు బంతికొలువు దివ్యమయీ శుభకృతూ 

ఆరురుచుల ఆహ్లాదం ఆరోగ్యపు రక్షణలే 
రోగభీతి తొలగించే వీరమయీ శుభకృతూ 

అశోకవని సీతమ్మకి ఆనందం  హనుమరాక 
ఇతిహాసపు చరిత్రలో హర్షమయీ శుభకృతూ 

పండితఘన పంచాంగం నక్షత్రము గణనలతో 
వాణిజ్యం రైతాంగపు సూత్రమయీ శుభకృతూ 

చైత్రమాస కోయిలమ్మ కుహూమనే మావిపైన 
పసుపుగడప లక్ష్మికళ శోభమయీ శుభకృతూ 

కవిసమయం ఉప్పొంగే జాతీయత భావాలను 
యువతలోని దేశభక్తి పూర్ణమయీ శుభకృతూ 

ఉపాధికే సాగు ఉమా శ్రామికజన  శ్రేయోనిధి
తగినఫలం అందించవె స్నేహమయీ శుభకృతూ !!

కామెంట్‌లు