శుభకృత్ నామ ఉగాది; *శ్రీలతరమేశ్ గోస్కుల**హుజురాబాద్.*
కమ్మటి పూల పరిమళాన్ని పరిసరమంతా వెదజల్లుతోంది నిండుగా విరబూసిన వేపచెట్టు..

ప్రకృతిని పులకింపగ వచ్చే చైత్రమాస ఆగమనంతో..
సరికొత్త అందాలను సంతరించుకున్న 
ప్రతి కొమ్మా రెమ్మా..
తెలుగుదనపు వైభవాన్ని అలంకరించుకోగా
అవనికెంతో ఆనంద హేల..

నూతన వత్సరాదికి స్వాగతం పలుకుతూ
కవితా దాహం తీర్చుకోవడానికి కలాలన్నీ ఒక పట్టు పడుతుంటే..
అటువైపుగా వెళుతున్న కోయిలమ్మను లేలేత మావి చిగురులు ఆహ్వనిస్తున్నాయి విందు కొరకు...

చిగురులనారగించిన కోయిలమ్మ
కొమ్మల్లో దాగి..
కొత్తరాగమేదో  అందుకుని..
సవరించిన గొంతుకతో సన్నాయినూదుతుంటే..
పిన్నా పెద్దలు పోటీపడి
ఆ రాగానికి చేరెను జతగా...
అలుపన్నది లేకుండా పరవశించిన పారవశ్యంతో
ఆ కోమలాంగి కుహూ.. కుహూ.. అంటూ
అమృతధారను ఆగకుండా గాలితో మమేకం చేసిన
గానకచేరిని సాగనంపుతుంటే..
ఆనంద సాగరాల తేలియాడుతున్నట్లుగా సాగుతోంది సంతోషాల జల్లు..

ఉగాది చెట్లమీదనే కాదు..
విరబూసిన చిరునవ్వులు ఒలకబోస్తూ
ప్రతి ఒక్కరి ముఖారవిందాలలో..
వెలుగుతున్న సంబరాలన్నీ
మామిడి తోరణాలు కట్టినట్టు
ఆనంద సందడులై వాడవాడలా పచ్చని పైరును తలపించాలీ...
కరోనాతో కలవరపడిన హృదయాలు
కొత్త ఊపిరితో ఉరకలు వేస్తూ..
ఉత్సాహం నింపిన ఆశలతో
నవ లోకానికి మెరుగులు దిద్దుకుంటూ..
షడ్రుచుల మేళవింపుతో
ఇంద్రధనుస్సు రంగులనద్దిన జీవనం వైపుగా సాగుతుండగా..
నిజ వసంతం నిత్యమై వెల్లివిరిసి..
మనతో కలిసిరాని గతానికి స్వస్తి పలికి
అందమైన ఆరోగ్యానంద జీవనానికి..
ఆహ్వానం పలుకుతూ..
పరుగు పరుగున వచ్చింది శుభకృత్ నామ ఉగాది..


కామెంట్‌లు