సంతోష రహస్యం; -- జగదీశ్ యామిజాల
 ఒకానొకప్పుటి ఓ రైతు సంగతి. ఓరోజు అతని దగ్గరున్న గుర్రం పారిపోయింది.
ఈ సమాచారం సన్నిహితులు, శ్రేయోభిలాషులు వచ్చి అయ్యో దురదృష్టవంతుడివో అని బాధపడ్డారు.
 రైతు అవునన్నట్టు తల ఊపాడు.
మరుసటిరోజు ఉదయం గుర్రం తిరిగొచ్చింది. వస్తూ వస్తూ అది మరో మూడు గుర్రాలను తన వెంట తీసుకొచ్చింది.
ఇరుగుపొరుగువారొచ్చి "ఎంత అద్భుతమో కదూ! ఏమైనా నువ్వు అదృష్టవంతుడి వేసుమా!" అని పొగిడారు.
వారి మాటలన్నీ విన్న రైతు మళ్ళా తలా ఊపాడు అవునన్నట్టు.
మరుసటిరోజు రైతు కొడుకు ఓ గుర్రమెక్కి స్వారీ చెయ్యడానికి ప్రయత్నించాడు. అయితే ఆ గుర్రం అతనిని ఒక్క ఉదుటున కింద పడేసింది. ఈ పడటంలో అతని కాలు విరిగింది. 
ఈ విషయం తెలిసి చుట్టుపక్కల వారొచ్చి రైతునీ, రైతు కుమారుడినీ ఓదర్చారు. వారి దురదృష్టం గురించి బాధపడ్డారు.
మళ్ళా రైతు తల ఊపాడు అవునన్నట్టు.
మరుసటి రోజు ఆ ఊరి పెద్దలు కొందరు ఈ దుర్వార్త తెలియక రైతు ఇంటికి వచ్చి అతని కొడుకుని సైన్యంలో చేర్పించడానికి ఒప్పించాలనుకున్నారు. అయితే విరిగిన కాలుకి కట్టుకుని మంచాన పడుకుని ఉన్న ఆ యువకుడిని చూసి వారు బాధ పడి వెళ్ళిపోయారు.
అయితే ఈ విషయం తెలిసి ఇరుగుపొరుగువారు వచ్చి మీ అబ్బాయి ఎంత అదృష్టవంతుడో కదూ...అతనిని సైన్యంలో చేర్పిస్తామంటూ మన ఊరిపెద్దలు వచ్చారటగా" అన్నారు.
రైతు తల ఊపాడు అవునన్నట్టు.
రైతుకి తెలుసు...
మంచీ చెడూ కలిసున్నాయని.
అవి రెండూ నాణానికి బొమ్మా బొరుసులాంటివని.
ఏ స్థితి అయినా ఒంటరిగా ఉండదు.
ఏ సంఘటనా ఓ ముగింపు కాదు.
ఏ క్షణానికా క్షణాన్ని ఎదుర్కోవలసిందే. 
ఉన్నది ఉన్నట్టు స్వీకరించడమే.
ఇంతకన్నా మరో తత్వం లేదు. రేపు అనేదొకటి ఎప్పుడూ ఉంటుంది. అది మంచి కావచ్చు. చెడు కావచ్చు. 
ఈ నిజాన్ని గ్రహించగలిగితే బాధ అనేది ఉండదనేదే జెన్ తత్వం.


కామెంట్‌లు