వీణారాణి ధనమ్మాళ్;- - యామిజాల జగదీశ్
 అది మద్రాసు (ఇప్పుడు చెన్నై అని అంటున్నాం) లోని జార్జ్ టౌన్ ప్రాంతం. ఈ ప్రాంతంలో చేతులతో లాగే రిక్షాలు ఉండేవి. 
 తర్వాతి రోజుల్లో తొక్కే రిక్షాలు అధికంగా కనిపించేవి. 
ఈ ప్రాంతంలోని రామకృష్ణ చెట్టి వీధిలోని ఒక ఇల్లు ఆరోజుల్లో పలువురు సంగీత విద్వాంసులకు చిరునామాగా ఉండేది. 
కర్ణాటక సంగీతంపట్ల ఆసక్తి ఉన్నవారు, కళాకారులు ప్రతీ శుక్రవారం సాయంత్రం ఆ ఇంటికి చేరుకునేవారు.
కొన్ని సార్లు స్థానికులేకాకుండా ఇతర ప్రాంతాల నుంచికూడా సంగీత విద్వాంసులు ఆ ఇంటికొచ్చి వారు. ఇంతకీ ఈ ఇల్లు ఎవరిదో చెప్పలేదు కదూ....
సంగీతానికి నిలయమైన ఈ ఇంటే వీణై ధనమ్మాళ్ 1867లో పుట్టిపెరిగారు. పేరు ధనమ్మాళ్ అయినప్పటికీ ఆవిడ వీణై ధనమ్మాళ్ గా ప్రసిద్ధులయ్యారు. ఆమె బామ్మ కామాక్షియమ్మాళ్ గాయని. అంతేకాదు ఆమె నర్తకీమణికూడా.
తంజావూరు సంస్థాన సంగీత కళాకారుల పరంపరకు చెందిన ధనమ్మాళ్ తల్లి సుందరమ్మాళ్ కూడా పాటలు పాడేవారు. తల్లీ, బామ్మల దగ్గర కీర్తనలు పాడటం నేర్చుకున్న ధనమ్మాళ్ ముత్యాలపేట త్యాగయ్యర్, తంబియప్పిళ్ళై దీక్షితర్ తదితరుల దగ్గర గాత్ర సంగీతంతోపాటు వీణ వాయించడంకూడా నేర్చుకున్న ధనమ్మాళ్ ఏడో ఏట అరంగేట్రం చేశారు.
సోదరి రూపవతితో కలిసి ధనమ్మాళ్ కచేరీ చేయగా తమ్ముడు నారాయణస్వామి వయోలిన్ వాయించాడు. 
ప్రముఖ వీణ విద్వాంసులైన రామచంద్ర,  (ట్రావన్కోర్),  కళ్యాణకృష్ణ తదితరుల వీణానాదాన్ని చెన్నైలో విన్న ధనమ్మాళ్ కూడా వీణ నేర్చుకోవాలనుకున్నారు.
మయిలై సౌరియమ్మాళ్ గొప్ప సంగీత కళాకారిణి. ఆమెను ఆదర్శంగా తీసుకున్న ధనమ్మాళ్ సౌరియమ్మాళ్ శిష్యులైన బాలకృష్ణ దగ్గర వీణపై ఓనమాలు నేర్చుకున్నారు. 
ధర్మపురి సుబ్బరాయర్ ఓ గొప్ప సంగీత జ్ఞాని. జావళులకు స్వరాలుకూర్చడంలో దిట్ట. ఆయన ధనమ్మాళ్ సంగీతాన్ని విని ఆవిడ కోసమే ప్రత్యేకించి కొన్ని పాటలు రాసి పాడించి స్వరపరిచారు.
వాలాజాపేట్టకు చెందిన బలదాస్ నాయుడు కూడా ధనమ్మాళ్ సంగీతాసక్తిని గుర్తించి ఆవిడకు తన వంతు సహకారమందించారు.
ఆవిడ బాణీ ఓ ప్రత్యేకం. అప్పట్లో అందరూ అది ధనమ్మాళ్ బాణీ అనే చెప్పేవారు.
వీణను ఓ పరిపూర్ణ సంగీత వాయిద్యంగా అభివర్ణించిన ధనమ్మాళ్ వీణ వాయించేటప్పుడు తంబూరా, మృదంగం వంటి పక్క వాయిద్యాల సహకారాన్ని కోరేవారు కాదు. ఆవిడ ఒక్క వీణతోనే కచేరీ చేసేవారు.
తెలుగు కీర్తనలతో సంగీత కచేరీలు కొనసాగుతున్న రోజుల్లో ఆవిడ తమిళ సాహిత్యానికి అధిక ప్రాధాన్యమిచ్చి వేదికలపై పాడటం మొదలుపెట్టారు. వాయించేందుకు క్లిష్టతరమైన తిరువాచగం, తిరుపుగళ్, తిరువరుట్పా, తేవారం వంటివాటిని కచేరీలలో పాడుతూ వీణ వాయించేవారు.
తెలుగు, తమిళం, సంస్కృతం తదితర భాషలలో పాడి వీణపై ఆ పాటలను పలికించడం ఆమె ప్రత్యేకత. ఒక్కొక్కప్పుడు కొందరు ప్రేక్షకులు చీటీలపై ఫలానా కీర్తన పాడమని రాసి పంపేవారు. 
సంగీతాన్ని ఓ తపస్సులా భావించి తన జీవితాన్ని అంకితం చేసుకున్న ధనమ్మాళ్
ఓమారు నాదస్వర విద్వాంసుడు తిరువావడుదురై రాజరత్తనం పిళ్ళై కచేరీకి ప్రేక్షకురాలిగా వెళ్ళారు. తోడి రాగానికి పెట్టింది పేరు రాజరత్తినం పిళ్ళై దర్బారీ రాగాన్ని నాదస్వరంలో పలికిస్తుండగా ధనమ్మాళ్ తటాలున లేచి కోపావేశంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు అక్కడే ఉన్న సహ విద్వాంసులు ఆవిడను శాంతింప చేసి మళ్ళీ కూర్చోపెట్టారు.
ఈ సంఘటన పిళ్ళైని ఇరకాటంలో పడేసింది. మీకెందుకు కోపం వచ్చిందని అడగగా ధనమ్మాళ్ " ఆయన దర్బారీ రాగంలో వాయిస్తూ మధ్యలో "నాయకి" రాగాన్నీ కలపి వాయించడం నచ్చలేదు" అని స్పష్టంగా చెప్పారు.
రాజరత్తినం పిళ్ళై నాదస్వర చక్రవర్తి కావచ్చు కానీ ఆయన రాగాలను కలిపి వాయించిన తీరు సబబుకాదన్నదే ధనమ్మాళ్ వాదన.
 1916లో బరోడాలో జరిగిన సంగీత మహోత్సవాలలో వీణ కచేరీ చేసిన ధనమ్మాళ్ 1935లో కాంగ్రెస్ హౌస్ లోనూ తన కచేరీతో సంగీతాభిమానులను ఆకట్టుకున్నారు. మన దేశంలోనే కాకుండా శ్రీలంకలోనూ కచేరీలు చేసారు ధనమ్మాళ్.  
ఈ క్రమంలో విదేశానికి వెళ్ళి మొదటిసారిగా కచేరీ చేసిన తొలి మహిళగా ఆమె చరిత్ర పుటలకెక్కారు. 
ప్రఖ్యాత కొలంబియా సంస్థ ఆమె కచేరీలను గ్రాంఫోన్ రికార్డులు విడుదల చేసింది.
ఆవిడ చైనీస్ భాషలోనూ పాటలు పాడారని  రసికమణి టి.కె. చిదంబరనాథ్ ఓమారు చెప్పారు. 
రాజాజీ, ధీరర్ సత్యమూర్తి వంటి ప్రముఖులకు ధనమ్మాళ్  కచేరీలంటే మహాఇష్టం.
వీణై రాణి, వీణై ఇసై పేరరసి, సిద్ధ విద్యాధరి వంటి బిరుదులు పొందిన ధనమ్మాళ్ దగ్గర ఎందరో శిష్యరికం చేశారు. 
తమిళనాడులో అందులోనూ ముఖ్యంగా మద్రాసులో సంగీతాభివృద్ధికి కృషి చేసినవారిలో ఒకరైన ధనమ్మాళ్ 1938లో కాలధర్మం చెందారు.
వీణై ధనమ్మాళ్ నూటయాభయ్యో జయంతిని పురస్కరించుకుని తమిళనాడులోని వివిధ ప్రాంతాలలో సంగీతకార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
నాట్యానికి తనను అంకితం చేసుకున్న తంజావూర్ బాలసరస్వతి ధనమ్మాళ్ మనవరాలే.


కామెంట్‌లు