గుర్తుకొస్తున్నాయి;ఉగాది పచ్చడి;- సత్యవాణి
  'ఇంటింటికో పువ్వు ,ఈశ్వరుడికోమాల ' అన్నరీతిగా ఉగాది పచ్చడికి ఇంటిటికీ ఒకరుచి. ఎవరింటి పచ్చడి రుచి వారిదే.ఒకరింటి రుచి మరొకరింటి పచ్చడికుండదు.
      ఈ ఉగాదినాడు తిన్న పచ్చడిరుచి, మళ్ళీ ఉగాదివరకూ ఊరిస్తూ నాలికమీదుండాలిమరి.. అలాగేఉంటుది మా పుట్టింట ఉగాది పచ్చడి.
     నిజానికి ఉగాదిపచ్చడి చేయడం ఒక కళ. అది అనువంశికంగా రావాలి. వస్తుందికూడా.అందుకనే ఎవరింటి ఉగాదిపచ్చడిరుచి వారింటిది.
     ఉగాదినాడు ఉదయాన్నే ఊర్లోవాళ్ళఇంటింటినుండీ చిన్నగిన్నెల్లో శాంపిల్ గా వచ్చే ఉగాది పచ్చళ్ళని,కళ్ళుమూసుకొని,నాలికమీద రాసుకుంటే చాలు, అది ఎవరింటి నుండివచ్చిందో  చెప్పేయొచ్చు.
      ఒకసారి ఉగాదినాడు రామచంద్రపురంలో మా పెద్దదొడ్డమ్మ ఇంట్లోఉన్నాను."స్నానంచేసిరావే, పచ్చడి ప్రసాదం తీసుకొందువుగాని " అని తొందరపెట్టింది. 
     పచ్చడిమీద ఆపేక్షతో హడావిడిగా తలకడుగుకొని రాగానే, ".పట్టు అరచెయ్యి"అంటూ ఉధ్ధరిణిడు చింతపండు ఊట చేతిలోవెేసింది. ఒకటో రెండో వేపపువ్వులు పైకి తేలుతున్నాయి పురిషిట్లో. కళ్ళకద్దుకొని నోట్లో పోసుకోవే !అలా వెర్రిమొఖం పడతావేం" అంటూ హెచ్చరించేకా,కళ్ళుమూసుకొని, గుళ్ళో తీర్తంలా సేవించాను. ప్రసాదం అంది కనుక మరింకేం దానిగురించి అననుగాక అనను." ఇదేమిటీ ఇలావుందీ?"అనిమాత్రమే అన్నాను.
   "మరి మీ ఇంట్లో ఇలా చేయదా మీ అమ్మ.?"అంది ఆరాగా మాదొడ్డ.ఆముదంతాగినట్లు పెట్టిన ని ముఖాన్ని చూసి.
      అవును మా ఇట్లో  ఉగాది పచ్చడిని ఇలా చేయదుగాక చేయదు మాఅమ్మ.
     పడమటాళ్ళందరూ ఇలాగే చెేసుకొంటారు గామోసు ఉగాదిపచ్చడిని.
     మరి మమ్మల్ని, మా అమ్మ వైపువాళ్ళంతా,తూర్పాళ్ళు,కొండాళ్ళు అంటారు.మరి మేము వాళ్ళకు తుర్పుదిక్కున వుంటాము.అలాగే మాఊరు రౌతులపూడి కొండలమధ్యన వుంటుంది.అందుకని అలాఅంటారు వాళ్ళు మమ్మల్ని.పైగా మా కొండాళ్ళకు పెద్దగా నాగరికతతెలియని మోటు మనుష్యులం అనివాళ్ళకు బలమైన అభిప్రాయం  ఆ పడమటివాళ్ళకు.
    ఇప్పుడు అసలు మా తూర్పాళ్ళ, అదే మా ఇంట్లో ఉగాదిపచ్చడి విషయానికొస్తే,మాఇంట్లో ఉగాది పచ్చడి చేయడం , అదొక పెద్ద యజ్ఞమే అనవచ్చు.
    మా అమ్మ కొత్తచింతపండూ,బెల్లం అరటిపళ్ళూ ,మొగ పాలికాపుల చేత, ఉగాది ముందురోజే కుందిరోట్లో వేసి  ఒక్కచుక్క నీళ్ళుకూడా పొయ్యకుండా రోకళ్ళతో కసా పిసా తొక్కించేసేది.అలాతొక్కగా వచ్చిన గుజ్జుమీశ్రమాన్ని అమ్మో,పిన్నో జాగ్రత్తగా రోటినుండి తీసి, చింతగింజలు ,తొళ్ళిలూ లేకుండా ,వడ్లజల్లెడలో వేసి ఆ మెత్తనిగుజ్జునంతా నెమ్మదిగా క్రింద పెద్ద బేసిన్లలోకి  దింపిం, ఒక పె...ద్ద గిన్నెలో పెట్టి మూత పెట్టి మర్నిటివరకూవుంచేవారు.
      ఆ మర్నాడు  తెల్లవారకుండానే ఉగాది తలంట్లు ముగించి ,రెండు కత్తిపీటలు ముందేసుకు కూర్చొని అమ్మా,పిన్నీ మామిడికాయలు,కొబ్బరిముక్కలు , చెరుకుగడలని  చిన్నచిన్న ముక్కలుగా, అరటిపండును చక్రాలుగా తరుగుతుంటే,మాపిల్లలందరంకూడా తలంట్లు ముగించి, వేపపువ్వుల గుత్తులనుండి, మొగ్గలూ,ఈనెలూ రాకుండా,లొకుండా ఏరడం చూస్తుంటే, అక్కడంతా  ఏదో ఒక   కుటీరపరిశ్రమలావుండేది అక్కడ ,అప్పుడు అక్కడ ఆ సీను చూసేవారికి.  
       అలా తరిగిన చిన్న చిన్నముక్కలను ,వేపపువ్వును, నిన్నదంపితీసిన చింతపండు,బెల్లం,అరటిపండు గుజ్జులో వేసి బాగా కలిపేసి మొత్తంగా పచ్చడిని పే....ద్ద స్టీలు గిన్నెలోకి తీసివుంచేవారు.
     అమ్మదేవుడికి వేరేగా,మడిగా మరికాస్త పచ్చడితోపాటు,మా తాతబ్బాయి కుట్టితెచ్చిన మా కొత్తబట్టలుకూడా,నైవేద్యం పెట్టేసేకా, అప్పుడు మాపిల్లలందరికీ గిన్నెల్లో, (కప్పుల్లోకాదుసుమా) పచ్చడి పెడితే ,పచ్చడిఆరగించేసాకా,కావాలన్నవాళ్ళం మరింత పచ్చడి మారేసుకొని తినేసేకా,ఆ రోజు అమ్మ చేసిన పండగ  పిండివంటలను చూస్తే, 'రాజును చూసిన కళ్ళకు మొగుణ్ణి చూస్తే ,మొత్తబుద్దౌవుతుందన్న  సామెత చందంగా వుండేదిమాకు.అన్నాలూ,పిండివంటలూ తినేస్తే,మరోమారు పచ్చడి తినడానికి కాళీ వుండదుకదాకడుపులో !
సందడిలో సడేమియాలా"ఏవండీ...!బాపనోరూ...!కాత్తేప్పూవు పచ్చడెట్టరాండీ!"అంటూ గళాసుసులేసుకొని ఉగాదిపచ్చడికోసం వచ్చే ఆనాటి పిల్లల మాట మరచిపోతే ఉగాది పండగేంటి?ఉగాది పచ్చడేంటి? .గరిటలోంచి పడనంత గట్టిగా వుండే పచ్చడిని,కాస్త వేరే తీసి గరిటజారుగా చేసి ఆపిల్లలకు గళాసుల్లో పోసి పంపిస్తే,గళాసుల్లో వేళ్ళుముంచి నాకుతూ,లొట్టలేసుకుంటూ వెళ్ళేవారా పిల్లలు.వాళ్ళకూడా గుడ్డల్లేకుండా వెంటబడివచ్చిన తమ్ముళ్ళకీ,చెళ్ళెళ్ళకీ మధ్యమధ్యన పచ్చళ్ళో వేళ్ళుముంచి నాకిస్తూ ఇళ్ళకి వెళ్ళేవారు వాళ్ళు.
    నిజానికి అలాగుత్తంగా చేసిన ఉగాది పచ్చడి ,కొత్త కుండలో వుంచి,పసుపుగుడ్డ వాసినకట్టి,పైనగట్టిగా మూతపెట్టి,పిల్లలకుఅందకుండా అటకమీదుంచితే మళ్ళీ వుగాది వచ్చేవరకూ ,కొత్తపచ్చడిలా వుండడమేకాదు, ,చుట్టాలింటికి వచ్చినప్పుడు తడిలేని కర్రతెడ్డుతో, కాస్తతీసి వారికొక కప్పులో పెట్టి,మనంకూడా కాస్తనోట్లో వేసుకొంటే,కలిగే హాయే వేరు. అలా ఆ ఉగాదిపచ్చడి నోట్లోవేసుకొన్న చుట్టాలు"ఆహా ఏమి రుచి ..,అనరా... మైమరచి ..,అంటూ పాట పాడనివాళ్ళైతే,వాళ్ళకి నోటిలో రుచిమొగ్గలు లేనట్లేకదా!మరి మీరేమంటారు? 
                 

కామెంట్‌లు