సాయంసంధ్య;-సావిత్రి కోవూరు
దినమంతయు స్వర్ణ కిరణాలు వెదజల్లిన
దినకరుడు డస్సి కెంజాయ వర్ణంతో పడమటి కనుమలు చేర వడివడిగా అడుగిడ
రవి కిరణ కాకచే అలసిన కాయములకు 
శీతల పవనములతో, వెన్నెల కాంతులతో 
జీవకోటికి సాంత్వన మొనరించ మెల్లమెల్లగా అరుదెంచు శశి రాకకై వేచియున్న కలువల చందంబున ప్రాణికోటి ఎదురుతెన్నులతో స్వాగతాలు పలుక సన్నద్ధమైన వేళ, 

తరువుల శాఖల గూటినున్న పక్కి కూనలు కువ కువ సవ్వడులతో ఆహారార్ధం వెళ్ళిన తల్లి రాకకై ద్వారంబుల చూపు నిలిపగ, తన నోట క్రిములు కరుచుకుని కిచకిచ మని శబ్దంతో వడివడిగా గూటిని చేరవచ్చె,

మేతకు అటవుల చేరిన గోవులు,
దూడల పాలు కుడుప ఆత్రంబుగ అంబా అంటూ మోరలెత్తి గబగబా అడుగులు వేయగ, 
మాతృ వియోగాన్నింక సహించలేక, క్షుద్భాద భరించలేక మెడలు పైకెత్తి అటునిటు వెదుకు నేత్రాలతో తల్లి ఆనవాలుకై చెవులు రిక్కించి అటూ ఇటూ కదులుతూ అంబా అంబా అని లేగలు అరుపులతో ఎదురుతెన్నులు చూడగ, 

ఉషోదయాన కేదారంబులు చేరిన కర్షకులు కాయ కష్టాలతో అలసిన కాయాలకు విశ్రాంతి గూర్చ గృహాల చేరా గబగబా అడుగులు వేయసాగిరి.


కామెంట్‌లు