ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య - ఎంపీపీ, జెడ్పీటీసీ
 ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతోందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కాల్వ శ్రీరాంపూర్ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు వంగల తిరుపతిరెడ్డి కోరారు. శుక్రవారం వారు కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన పాఠశాల వార్షిక మహోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మన బడి పథకం ద్వారా కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలను కల్పిస్తోందని, అన్ని హంగులతో పాఠశాలలను అద్భుతంగా తయారు చేస్తోందన్నారు. అనుభవజ్ఞులు, నిష్ణాతులైన ఉపాధ్యాయులచేత పిల్లలకు భావనలు, కృత్యాధార బోధన చేయిస్తున్నట్లు చెప్పారు. ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి తన సొంత ఖర్చులతో పాఠశాల అభివృద్ధికి, పిల్లల సర్వతోముఖాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్యను వారు అభినందించారు. 
           అనంతరం కాల్వ శ్రీరాంపూర్ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రమేష్ మాట్లాడుతూ ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈర్ల సమ్మయ్య ప్రత్యేక చొరవ తీసుకుని తన సొంత ఖర్చులతో పాఠశాలలో పిల్లల కోసం అనేక వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించి డబ్బులు వృధా చేసుకోవద్దని, ఉచిత, నాణ్యమైన విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లల్ని చేర్పించాలని ఆయన కోరారు. అద్భుతమైన చిత్రాలను గీస్తున్న పాఠశాల విద్యార్థి తూర్పాటి ప్రకాష్ ను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన తన సొంత ఖర్చులతో పాఠశాల పిల్లలకు  సమోసాలు కొని అందజేశారు. పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో పిల్లలు చేసిన నృత్యాలు, పద్య పఠనం, ఇతర ప్రతిభా అంశాలు పలువురిని ఆకర్షింపజేశాయి.
           ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్, జెడ్పీటీసీ సభ్యులు వంగళ తిరుపతిరెడ్డి, శ్రీరాంపూర్ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు యర్రా రమేష్, ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, శ్రీరాంపూర్ ఎంపీటీసీ సభ్యురాలు మాదాసి సువర్ణ రామచంద్రం, ఉపాధ్యాయినులు ఎడ్ల విజయలక్ష్మి, కర్ర సమత, జువ్వాజి వైశాలి, తూండ్ల అరుణ మధ్యాహ్న భోజన పనివారు దంతనపల్లి విజయ, దంతనపల్లి సుశీల, దంతనపల్లి దుర్గమ్మ, అనుముల రమేష్, పిల్లల తల్లిదండ్రులు, యువతీ, యువకులు, గ్రామస్తులు, పలువురు పాల్గొన్నారు.కామెంట్‌లు