శుభయుగాది;-పద్మ త్రిపురారి- జనగామ.
పల్లవి::
శుభముగ వచ్చెను శుభ యుగాది
శుభములు తెచ్చెను నవయుగాది
శోభిత వర్ణము శుభ యుగాది
శుభముల హర్మ్యము నవయుగాది
           "శుభముగ"

చరణం::
మనసు మమతలే మల్లె విరులుగా
సరస భాషణే మావి చిగురుగా
కురిసి విరిసెలే సుమ హాస కాంతులు
మురిసి మెరిసెలే ప్రేమ దీప్తులు.

         "శుభముగ"

చరణం::
కమ్మని రవళుల కోకిలమ్మలే
సుందర తెలుగుకు రథసారథులై
ఇంపుగ పాడిన మధుర గానమే
సొంపుగ నిండెను ధరణి గీతమై.

        "శుభముగ"

చరణం::
మధుమాస మధువుతో హృదులు నిండగా
మరులుగొలిపెలే కుసుమ వల్లులు
తేట తెలుగులా కవన జల్లులే
తేనె కలశమై వసుధ చేరెనూ.

         "శుభముగ"

చరణం::
ఇంటింటి వెలుగులై ఆడపిల్లలు
పట్టు పరికిణితొ సందడి చేయగ
మహాలక్ష్మి రూపమై మంగళకారిణి
శుభకృతి వచ్చెను శుభములివ్వగా.

          "శుభముగ"

           

కామెంట్‌లు