దిష్టిపిడత! అచ్యుతుని రాజ్యశ్రీ

 పూర్వం ఇంటిపైన పొలంలో దిష్టి బొమ్మను పెట్టేవారు. కుండకు నల్లరంగుపూసి తెల్లగా  పెద్ద పెద్ద కళ్ళు  ఎర్రని నాలుక గుబురుమీసాలతో ఉండే దిష్టి బొమ్మను చూస్తే పొలంకి ఇంటికి దిష్టి తగలదని ఓభావం ఉండేది. కొందరు వాటికి చొక్కా లాగుకూడా తొడుగుతారు.ఆపల్లె షావుకారు రామయ్య ఒక రెండు అంతస్తుల మేడ కట్టించాడు. తన ఇంటికి దిష్టి తగలకుండా కుండతో దిష్టి బొమ్మను చేసి మేడపైన ఒక పెద్ద గడకర్రకి వేలాడదీశాడు.దాన్ని చూస్తూ నే పిల్లలు దడుచుకునేవారు.రాత్రి పూట మరీ భయంకరంగా కనపడేది ఆబొమ్మ.పక్షులు కూడా జడుసుకుని అటువైపు రావటం మానేశాయి. అంతకు ముందు ఎంచక్కా కువకువలాడుతూ అక్కడ ఉన్న గింజలు ఏరుకుతినేవి.హాయిగా ఎగురుతూ సందడి చేసేవి.షావుకారు కొడుకు రాము వాటిని చూస్తూ ఆడిపాడుతూ గంతులేసేవాడు.ఇప్పుడు వాడు గింజలు వేసి పిలుస్తున్నా ఒక్క పిట్టకూడా రావకపోటంతోదిగాలు పడ్డాడు. "అమ్మా!పిట్టలు రావటంలేదు.నన్ను బైటికి ఆడుకోడానికి పోనివ్వవు.నాన్న  ఎవరినీ ఇంటికి రానివ్వరు. "అని గునుస్తున్నాడు."బడిలో ఆటలు చాలవా?ప్రైవేటు సార్ వస్తారు. బాగా చదువు కుంటే మంచి ఉద్యోగం కారు హోదా వస్తాయి "అని కసిరింది తల్లి. ఇంట్లో చదువు తప్ప వేరే మాట వినపడకూడదు .అందుకే రామూకి చిరాకు!అసలే ఒంటికాయసొంఠికొమ్ము కావటంతో మరీ బాధగాఉంది వాడికి. "ఒరే!పెద్ద గాలివాన  ఉరుములు మెరుపులు వర్షం వచ్చేలా ఉంది. మేడ పైకి వెళ్లకు"అంది తల్లి. ఐనా మేడ పైన నించున్న వాడికి  రోడ్డు పై వెళ్ళే పిల్లల మాటలు వినపడసాగాయి."అమ్మో!ఆబొమ్మ  ఎంత భయంకరంగా ఉందో? రాక్షసుడా?భూతమా?" "కాదు.మంత్రగాడేమో?మనల్ని మాయం చేస్తాడేమో?" పిల్లలు ఆదిష్టి పిడతను వర్ణిస్తూ ఉంటే  ఆబొమ్మ వికటంగా నవ్వేది.రాముకి బాధగా అనిపించింది "ఛ..ఛ!అందరినీ భయపెట్టే ఇలాంటి బొమ్మను  నాన్న పెట్టడంవల్ల నాతో ఎవరూ ఆడరు మాటాడరు"ఆరాత్రి జోరుగా కుండపోతగా వర్షం కురిసింది. ఆవర్షపు ధాటికిపొగరుగా ఇకిలించే ఆబొమ్మ  కున్న నల్లరంగుపోయి మొహమంతా కళ్ళు నోరు కనపడ కుండా  అలుక్కుపోయింది.తెల్లారుతూనే ఒక కాకివచ్చి దానిపై వాలింది. పిట్టలన్నీ దానినెత్తిపై చేరి కువకువలాడుతూ ఉంటే దిష్టి పిడత కోపంగా చూసినా అదరలేదు బెదరలేదు. కాకులు  దాన్ని పొడవటంతో మొహమంతా చిల్లులు పడ్డాయి.ఇక అంతే పిల్లలు అంతా గోలగోలగా అరవసాగారు."అరే!అది ఉట్టి మట్టి కుండరా! ఇన్నాళ్ళు  అనవసరంగా భయపడ్డాం."వారి మాటలకు రాముబాగా సంతోషించాడు."ఛ..ఛ..అసహ్యం గా ఉంది ఈమట్టి పిడత"అని తల్లి దాన్ని  ఓమూల పారేసింది.పావురాలు ఇతర పిట్టలు  ఇప్పుడు డాబాపై వాలటంతో రాము కేరింతలు కొడుతూ తన ఒంటరితనం ని మర్చిపోయాడు🌹
కామెంట్‌లు