ముద్రణారంగంలో లక్ష్మీ కృష్ణమూర్తి;-- యామిజాల జగదీశ్
 తమిళనాడుకు చెందిన లక్ష్మి కృష్ణమూర్తి ముద్రణారంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్న మహిళ.
ఈరోజుల్లో చదివే అలవాటు ఆధునిక పరికరాల సహకారంతో వేగంగానే విస్తరిస్తోంది. ఇది కాదనలేని నిజం.
అయితే ఎన్ని వసతులున్నా అచ్చు పుస్తకాలకంటూ చదువరుల సంఖ్య ఏమీ తగ్గలేదు.
ప్రతి ఏడాది మద్రాసులో నిర్వహిస్తున్న పుస్తకప్రదర్శనే ఇందుకు ఒక ఉదాహరణ.
ఇంటర్నెట్ సాయంతో చదివేవారున్నప్పటికీ ముద్రణా రంగంలోనూ ఆధునికత చోటుచేసుకుంటోంది. ఈ ఆధునికతవల్ల నాణ్యమైన ముద్రణ జరుగుతోంది. 
అయితే కొన్ని సంవత్సరాల క్రితం నాణ్యమైన పుస్తక ముద్రణ రంగంలో అడుగుపెట్టి తమిళనాడులో ఓ ఆదర్శమహిళగా ఉన్నవారే లక్ష్మీ కృష్ణమూర్తి.
తమిళ పుస్తకాల ముద్రణలో లక్ష్మీ కృష్ణమూర్తి అని అనడంతోనే తెలియనివారుకూడా పాఠకలోకం ఆమె పేరును ప్రస్తావిస్తారు. ఆ మేరకు ఆమె పాఠక లోకం అనే నాణ్యమైన సాహిత్య వర్గాన్ని ఏర్పాటు చేసి మంచి మంచి పుస్తకాలను ముద్రించి వెలుగులోకి తీసుకొచ్చారు లక్ష్మీ కృష్ణమూర్తి.
 స్వాతంత్ర్య సమరయోధురాలు. ప్రముఖ కాంగ్రెస్ నేత అయిన ధీరర్ సత్యమూర్తి దంపతులకు కుమార్తెగా 1925 జూలైలో జన్మించారు. 
సత్యమూర్తి ప్రారంభం నుంచే తమ కుమార్తెను ఓ సాహసానికి మారుపేరుగా పెంచారు. 
లక్ష్మికి వీణ వాయించడం,.గుర్రపుస్వారీ, బొమ్మలు గీయడం, సంగీతం ఇలా విభిన్న రంగాలలో ప్రవేశముంది.
ప్రతి పుట్టినరోజు నాడు తండ్రి సత్యమూర్తి కానకగా పుస్తకాలివ్వడం ఆమెలో సాహిత్యంపట్ల మక్కువ పెంచింది. 
తమిళంతోపాటు ఇంగ్లీషు, హిందీ భాషలలోనూ సాహిత్యపుస్తకాలను ఆమె చదవసాగారు.
 ఆంగ్లేయుల పాలనలో జైలుపాలైన ధీరర్ సత్యమూర్తి ఆరోగ్యం క్షీణించి అక్కడే మరణించారు.
అనంతరం తండ్రి అప్పటికే నిశ్చయించిన కేరళకు చెందిన కృష్ణమూర్తిని పెళ్ళాడి కేరళకు వెళ్ళిపోయారు. అయితే అక్కడ కూడా ఆమె సామాజిక కార్యక్రమాలు కొనసాగాయి. తమ ఇంట్లోనే మహిళలకోసం ఉచిత వైద్యశాలను ప్రారంభించారు. అలాగే సేవాకార్యక్రమాలనుకూడా చేపట్టరు.
అనంతరం కొందరు కాంగ్రెస్ నేతల కోరిక మేరకు ఆమె తమిళనాడుకు చేరుకున్నారు.
1964, 1970లలో జరిగిన ఎన్నికలలో పోటీ చేసి ఆమె శాసనసభకు ఎన్నికయ్యారు.
తండ్రి సత్యమూర్తి ఎట్టా ఆంగ్లేయుల అణచివేత ధోరణ పాలనా తీరు వ్యతిరేకించారో అట్టాగే లక్ష్మీ కృష్ణమూర్తికూడా 1975లో కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎమర్జన్సీ విధించినప్పుడు తాను కాంగ్రెస్సులో ఉన్నప్పటికీ దానిని వ్యతిరేకిస్తూ ఉద్యమించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నుంచి తప్పుకుని 1977లో జనతా పార్టీ తరఫున చెన్నై మైలాపూర్ నియోజక వర్గం నుంచి శాసనసభ ఎన్నికలలో పోటీ చేశారు.
ఈ ఎన్నికలలో ఆమె ఓటమి చవిచూశారు. 
దీంతో రాజకీయాల నుంచి తప్పుకుని సామాజిక, సాహిత్య సేవకు అంకితమయ్యారు.
కల్కి, స్వదేశమిత్రన్ హిందు వంటి నాటి ప్రముఖ పత్రికలలో కథలు వ్యాసాలు రాసిన లక్ష్మీ కృష్ణమూర్తి రాసిన అయిందావదు సుదందిరం (అయిదో స్వాతంత్ర్యం) అనే వ్యాససంపుటిని తమిళ ప్రముఖ ప్రచురణకర్తలలో ఒకరైన శక్తి వై. గోలహవిందన్ ప్రచురించారు. ఆమె భర్త కృష్ణమూర్తికూడా మళయాలం నుంచి ఇంగ్లీష్ లో అనువాదాలు చేస్తుండేవారు.
సాహిత్యంపై ఎనలేని మక్కువ కలిగిన ఈ దంపతులు 1964 - 65 ప్రాంతంలో వాచగర్ వట్టం అనే సాహితీ సంస్థను ఏర్పాటు చేశారు. మంచి మంచి రచనలను నాణ్యమైన రీతిలో ముద్రించాలనుకుని బుక్ వెంచర్ అనే ప్రచురణ సంస్థను మొదలుపెట్టారు. ప్రారంభంలోనే చందాదారులుగా చేరి 25 రూపాయలు కట్టిన వారికి తమ సంస్థ తరఫున ముద్రించే పుస్తకాలను తక్కువ ధరలకు అమ్ముతూ వచ్చారు. ఈ సంస్థ మొట్టమొదటగా ముద్రించిన పుస్తకం రాజాజీ రాసిన "సోక్రధర్ : ఆత్మ చిందనైగళ్". ఈ పుస్తకాన్ని 1965లో రాజాజీతోనే ఆవిష్కరింపచేశారు. ముద్రణకు సంబంధించి లక్ష్మీ కృష్ణమూర్తి ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. మొదటి పుస్తకానికి కళాచారం రాజగోపాల్ ముఖచిత్రం వేసిచ్చారు. ఆ తర్వాత ఆ చిత్రాన్నే ఈ పబ్లికేషన్ చిహ్నంగా మారింది.
పత్రికలలో వచ్చిన నవలలను ఈ సంస్థ ముద్రించి పాఠకలోకానికి ముచ్చటగా అందించేది. ప్రముఖ రచయితలను పుస్తకాలను వెతికి వెతికి అందంగా ముద్రించేవారు. అలాగే ప్రతిభావంతులైన రచయితలను గుర్తించి వారిన ప్రోత్సహించి పుస్తకాలు రాయించి ముద్రించడంలో ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. 
 
న. పిచ్చుమూర్తి, లా.స.రా., కృత్తికా, నా. పార్థసారథి ఇలా  ఎందరో రచయితల పుస్తకాలను ముద్రించి ప్రచారం చేసిన ఈ సంస్థ ప్రచురణలలో ఒకటైన నడందాయ్ వాయి కావేరి అనే వ్యాససంపుటికి విశేష ఆదరణ లభించింది.
పుస్తకముద్రణలకే పరిమితం కాకుండా తన ఇంటే సభలూ సమావేశాలు ఏర్పాటు చేసి రచయితలను ఆహ్వానించి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే బుక్ క్లబ్ అనే సంస్థను ఏర్పాటు చేసి పుస్తకాల గురించి విశేష సేవలందించారు.
పుస్తకాలకే పరిమితమవకుండా వాచగర్ సెయిది అనే పత్రికను నడిపారామె. 
అలాగే "నూలగం" అనే శీర్షికతో పుస్తకాలకు సంబంధించిన మాసపత్రికనుకూడా నడిపారు లక్ష్మి.
వాచగర్ వట్టం చివరగా ముద్రించిన పుస్తకం కాసలవిల్ ఓర్ ఉలగం. ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత సుజాతా రాశారు. ఆయన అసలు పేరు రంగరాజన్. ఈయన తన భార్య సుజాత పేరుతోనే తమిళపాఠకులకు సపరిచితులు. 
లక్ష్మీ కృష్ణమూర్తి వాసగర్ వట్టం మొత్తం నలబై అయిదు పుస్తకాలను ముద్రించింది. కాలం గడిచిన కొద్దీ చందాదారుల సంఖ్య తగ్గడంతోపాటు తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ఈ సంస్థ పుస్తకాల ముద్రణను ఆపివేసింది. పబ్లికేషన్స్ నుంచి తప్పుకున్న ఈమె సామాజిక సేవాకార్యక్రమాలనం మాత్రం కొనసాగించారు.
తమిళంలో తొలిరోజుల రచయితలలో ఒకరైన వై. ము. కోదైనాయగి అమ్మాళ్  తన పుస్తకాలను తానే ముద్రించి పాఠకులకు దగ్గరయ్యారు. కానీ లక్ష్మీ కృష్ణమూర్తి ఇతర రచయితల పుస్తకాలను ముద్రించి అమ్మడంతో తమిళంలో మొదటి మహిళా ప్రచురణకర్తగా చరిత్రపుటలకెక్కారు.
ఇలా ఎన్నో విశేషాలను కలిగి ఉన్న లక్ష్మీ కృష్ణమూర్తి తన ఎనభై మూడోళేట 2009 జూన్ 12న కన్నుమూశారు. 


కామెంట్‌లు