ధాత్రి గొంతున గరళం నింపొద్దు;- కవిరత్న నాశబోయిన నరసింహ (నాన),ఆరోగ్య పర్యవేక్షకులు,NVBDCP సబ్ యూనిట్ సికింద్రాబాద్, 8555010108.
ఆకుపచ్చని పచ్చిక వస్త్రాలంకరణతో
కదిలే కాలాన కరుగుతున్న వనరులతో
జీవ వైవిధ్య పరిరక్షణ మూలాంకురం 
సకల జీవుల మనుగడ కాధారం ధరిత్రీ! 

అమృత జలం దోసిలిలో ఒడిసిపట్టి 
ఆకలి దప్పిక తీర్చిఆపదలో ఔషధాల నిచ్చే
ఖనిజ సంపదతో కళ కళలాడే కల్పవల్లీ వసుధ
నేల విడిచి సాము చేయుట పెను ప్రమాదం
కోపోద్రిక్త ప్రకృతి ప్రళయ కాల సంకేతం!

లావాగ్ని శిఖలు దేహాన్ని దహించినా
శీతల శ్వేత కొండలు గజ గజ వణికించినా
గునపాలు యంత్రాలు గుండె లోతుల్లో గాయపర్చినా
గంభీర వదనం మొక్కవోని సహనంతో
పంట సిరుల సౌభాగ్యధాయిని అవని!

ఆకాశహర్మ్యాల పరంపరతో పట్టణీకరణం
శాస్త్ర సాంకేతిక ఒడిలో పారిశ్రామికీకరణం              
ప్లాస్టిక్ భూతాన్ని పెంచి పోషించే పరిణామం 
అనుదినం ధరణి కాలుష్య కాసారమవుతూ 
విషజ్వాల కోరల్లో చిక్కి విలవిల లాడే ధైన్యం! 

కృత్రిమ ఎరువు పురుగు మందుల ధోరణికి
పండిన పంట సైతం విష రసాయన తుల్యం
జంతు వృక్ష నర జాతి అస్తిత్వం  ప్రశ్నార్థకం
ఏదోనాడు మట్టిలో కలిసే వాళ్ళమని మరవొద్దు
ఓ నాగరికుడా! ధాత్రి గొంతున గరళం నింపొద్దు!
(ఏప్రిల్ 22, ధరిత్రి దినోత్సవం సందర్భంగా..)


కామెంట్‌లు