*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౫౫ - 055)*
 *సుజన పద్ధతి*
మత్తేభము:
*పరహింసాపరకీయవిత్తరణా భావంబు సత్యవ్రతా*
*దరముం దానపరత్వ మన్యవనితో దంతో మూకత్వముం*
*బరతృష్ణాఝరభంజనంబు గురున మ్రత్వంబునుం బ్రాణభృ*
*త్కరూణాశాస్త్రసమత్వసద్విధులు భద్రప్రాప్తికిన్ మార్గముల్*
*తా:*
ఇతరులకు హాని చేయకుండా ఉండటం, ఇతరుల సంపదల మీద మనసులో కోరిక పెంచుకోకుండా ఉండటం, సత్యము మాత్రమే మాట్లాడుతూ వుండటం, దానము చేసే గుణము కలిగి ఉండటం, ఇతర స్త్రీల గురించి మాట్లాడకుండా మౌనము పాటించడం, అత్యాశను కలిగి వుండ కుండా ఉండటం, గురువుల యందు వినయము కలిగి ఉండటం, అన్ని ప్రాణుల యందు సమభావము కలిగి ఉండటం, అన్ని శాస్త్రముల యందు సమానంగా గౌరవము కలిగి ఉండటం, అనే ఈ లక్షణాల వల్ల అన్ని విధాలైన కీర్తి పొందటానికి చక్కని మార్గము.......... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
•ప్రతీ మనిషీ యశోధరుడు అవ్వడానికి తను ఎంచుకోవలసిన మార్గం గురించి కవి ఇక్కడ చెప్పారు. మనమందరం ముఖ్యంగా గుర్తు వుంచుకోవలసిన విషయం ఏమిటంటే, మనది కానిది ఏది మన దగ్గర వుండదు. మనకు రావలసిన దాన్ని ఎవరు ఎంత ప్రయత్నించినా రాకుండా ఆపలేరు. ఇంత చిన్న విషయాన్ని మనం మర్చి పోకుండా వుండేలా, తన నుండి దృష్టి మరల్చుకుని వేరే దారిలో వెళ్ళకుండా వుండేలా ఆ పరాత్పరుడు మనల్ని ఆశీర్వదించాలి అని ఆ పరమేశ్వరుని వేడుకుంటూ...... .*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు