*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౫౬ - 056)*
 *సుజన పద్ధతి*
తేటగీతి:
*సంపదలు గల్లగుతరి మహా జనులహృదయ*
*మభినవోత్పలకోమలం బగుచు వెలయు;*
*నాపదలు వొందునపుడు మహామహీధ*
*రాశ్మసంఘాతకర్కశం బై తనర్చు.*
*తా:*
మహాత్ములకు సంపదలు కలిగినప్పుడు వారి మనసులు అప్పడే పుట్టిన కమల పవ్వుల లాగా ఎంతో సున్నితంగా వుంటాయి. అలాగే వారికి కష్టాలు వచ్చినప్పుడు పెద్ద కొండ బండరాయి లాగా ఎలా కదలకుండా వుంటుందో అలా కదలకుండా గట్టి మనసు కలవారై వుంటారు......... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*మనసుతో, బుద్ధి తో ఆలోచించ గలిగిన మనమందరం కూడా సంపదలు వచ్చినప్పుడు గర్వంతో పొంగి పోకుండా, ఎచ్చులకు పోయి లేని ఇబ్బందులు కొని తెచ్చు కోకుండా వుండాలి. అదే విధంగా, పరిస్థితులు అనుకూలించక, కష్టాలు వచ్చినా, వాటి ప్రభావం వల్ల కుంగి పోకుండా, ఎంత పెద్ద తుపాను వచ్చినా, పెద్ద పెద్ద అలలు తనను చుట్టు ముట్టినా కూడా ఒక కొండ కదలకుండా నిశ్చలంగా ఎలా ఉంటుందో అలా మనో నిబ్బరంతో వుండాలి. పరిస్థితుల ప్రభావానికి అతలాకుతలం కాకుండా నిశ్చల చిత్తము తో స్థిరంగా వుండగలిగే మనఃస్థితిని మనకు ప్రసాదించమని ఆ అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని మనస్పూర్తిగా కోరుకుంటూ..... .*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు