*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౫౭ - 057)*
 *సుజన పద్ధతి*
మత్తేభము:
*పొసఁగం దానము గుప్త, మర్ధి భవనంబుం జేరుచో సంభ్రమో*
*ల్లసదుత్థానవిధనముం, బ్రియవిధుల్ గావించి మౌనంబు, రా*
*జసభన్, మిత్త్రకృతి ప్రకాశనముఁ, గుత్సాకర్మవైముఖ్య, మీ*
*యసిధారా వ్రతచర్య యెవ్వఁడు మహార్యశ్రేణికిం దెల్పెనో!*
*తా:*
మన నేల మీద మహానుభావులకు, అందరికీ తెలియకుండా దానము చేయాలని, మన సహాయము కోరుతూ ఇంటికి వచ్చిన వారికి తగిన మర్యాదలు చేసి కూర్చో బెట్టటము, ఎదుటి వారికి చేసిన సహాయము గురించి మౌనముగా మాట్లాడకుండా వుండటము, మనకు ఎవరైనా మంచి చేస్తే దాని గురించి పదిమందికి చెప్పడం, ఎదుటి వారి గురించి చెడుగా మాట్లాడకుండా వుండటం అనే అతి కష్టమైన పద్ధతులు ఆచరించమని ఎవరు చెప్పారొ కదా!......... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*మన చేత చేయబడే మంచి పనులను వీలైనంత వరకూ ఏవిధమైన ఆర్భాటం లేకుండా జరగాలి అని పెద్దలు చెప్పే మంచి మాట. మనం కుడి చేతితో చేసే దానం ఎడమచేతి కి తెలియ కూడదు అని కూడా చెప్తారు. ఒకవేళ మనం ఎవరికైనా ఏమైనా ఇద్దాము అనుకున్నప్పుడు, ఎడమ చేతిలో గనక ఆ వస్తువు లేదా డబ్బు వుంటే ఆ చేతితోనే ఇచ్చేయ మంటారు. ఎందుకంటే, ఎడమ నుండి కుడికి మారేలోపు, ఇవ్వాలి అనే మన ఆలోచన మారి పోతుందేమో అని. ఇంతటి మంచి సంప్రదాయాలు మనకు ఉన్నాయి. కానీ, ఈ రోజుల్లో మనం ఎవరికైనా చిన్న సహాయం చేసిన ఎక్కువ ప్రచారం చేసుకోవడం జరుగుతోంది. ప్రచార పటాటోపం ఎక్కువ అవుతోంది. కవి చెప్పినటువంటి మంచి లక్షణాలను మనం అలవాటు చేసుకునే సదవకాశం పరాత్పరుడు మనకు ఇవ్వమని కోరుకుంటూ ..... .*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు