*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౬౪ - 064)*
 *పరోపకార పద్ధతి*
మత్తేభము:
*తమ కార్యంబుఁబరిత్యజించియుఁబరా ర్ధప్రాపకుల్ సజ్జనుల్,*
*దమకార్యంబు ఘటించుచున్ బరహితార్ధవ్యాపృతుల్ మధ్యముల్,*
*దమకై యన్యహితార్ధఘాతుకజనుల్, దైత్యుల్ వృధాన్యార్ధభం*
*గము గావించెడువార లెవ్వరో యెరుంగన్ శక్యమే యేరికిన్?*
*తా:*
తమకు పనికి వచ్చే పనిని పక్కకు పెట్టి ఎదుటి వారి పని చేసి పెట్టే వారిని మంచివారు అంటారు. తమపని చేసుకుంటూ ఎదుటి వారి పని కూడా చేసే వారిని మధ్యములు అంటారు. తమ పని కోసం ఎదుటి వారి పనిని చెడగొట్టే వారిని దుర్మార్గులు అంటారు. కానీ, తమకు ఏవిధముగా ఉపయోగము లేకపోయినా, ఎదుటి వారి పనిని చెడగొట్టే వారిని ఏమనాలి. ఇటువంటి వారిని గుర్తించడం ఎవరికైనా చాలా కష్టమైన పని......... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*మన ప్రస్తుత సమాజంలో ఎవరి పని వారు చక్కబెట్టుకోవడం అనేది చాలా సామాన్య విషయం. "నీ పనిని నీవు చేసుకుంటూ వున్నప్పుడు మరణం సంభవించినా, ఉత్తమగతులు లభిస్తాయి" అని గీతా వాక్యము. కానీ, మన మధ్యలో వున్న చాలా మంది, ఎవరికి లాభిస్తుందో తెలియక పోయినా ఎదుటివారి పనులు చెడగుట్టడంలో ముందు వుంటారు. ఇలా ఎదుటి వారి పని చెడగొట్టడము బలన వారికి ఏమీ లాభం రాదు, కానీ వేరెవరినో తృప్తి పరచడానికి ఈ విధంగా ప్రవర్తిస్తారు. ఈ ప్రత్యేకమైన జాతిని మనం మన కార్యస్థలాలలో కూడా చూస్తూ వుంటాము. ఇటువంటి వారి వల్ల, వారు పని చేసే ఆఫీసుకు గానీ, వారకి గానీ, వేరెవరికైనా గానీ, సమాజానికి గానీ ఎటువంటి ప్రయోజనమూ వుండదు. వీరు చీడ పురుగు వంటివారు. ఈ విధమైన వ్యక్తుల బారిన పడకుండా మనకు రక్షణ కల్పిస్తూ, ఇటువంటి చెడు ఆలోచనలు మనకు రాకుండా మనల్ని కాపాడుతూ, సన్మార్గంలో ముందుకు నడిపించమని ఆ ప్రాతః స్మరణీయుని వేడుకుంటూ..... .*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు