*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౬౫ - 065)*
 *పరోపకార పద్ధతి*
తేటగీతి:
*అఘమువలన మరల్చు, హితార్ధకలితుఁ*
*జేయు, గోప్యంబువదాఁచుఁ, బోషించు గుణము*
*విడువఁడాపన్ను, లేవడి వేళ నిచ్చు;*
*మిత్రుఁడీలక్షణంబుల మెలగుచుండు.*
*తా:*
స్నేహితుడు అనబడే వారు, చెడుపనులు చేయడం నుండి మన ఆలోచనలను మార్చుతూ వుంటారు. మంచి పనులు చేయడానికి మనల్ని ఉత్సాహ పరుస్తూ ఉంటారు. మన గురించి దాచ వలసిన విషయాలను దాచి వుంచుతారు. మంచి గుణములను వదిలి పెట్టరు. ఆపదలు కలిగినప్పుడు మనల్ని వదలి వెళ్ళరు. మనకు సంపద తగ్గి కష్టాలు వస్తే కావలసిన ధన సహాయం చేస్తారు. ఈ లక్షణాలను స్నేహితుడు ఎప్పుడూ వదలి పెట్టరు. ......... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*స్నేహం, స్నేహితుల గురించి మాట్లాడుకోవాలి అంటే, కృష్ఞ పరమాత్మ, వాలి, కుచేలుడు, కర్ణుడు వంటి వారి గురించి మాట్లాడుకుంటే స్నేహితుడు ఎలావుండాలో మనకు తెలుస్తుంది. అందుకే, "భారతం, భాగవతం, రామాయణం ఈ గ్రంధాలు కథలు కాదు జీవన పద్ధతులు చూపే చుక్కానులు" అని పెద్దలు మనకు చెపుతారు. ఈ రోజుల్లో మనకు ఇంతటి నిస్వార్ధ స్నేహితుడు దొరకక పోవచ్చు. కానీ, మనం ఎవరికైనా ఇంత మంచి మిత్రుడు గా వుండే ప్రయత్నం మనః స్ఫూర్తితో చేస్తున్నామా! "ఎదుటి వారు మనతో మంచిగా లేరు కాబట్టి, మనం కూడా మంచివారు గా వుండవలసిన పనిలేదు" అని అనుకుంటున్నాము. అందుకే మనచుట్టూ వున్న సమాజంలో ఇంత డొల్లతనము కనబడుతుంది. మనచుట్టూ వున్నవారు ఒక కృష్ణడు, వాలి, కర్ణుడు కావాలి అనుకోవడం అత్యాశ అవుతుందేమో కానీ, నేను ఒక కర్ణుడి లాగా వుండాలి, వుండే ప్రయత్నం చేయాలి అనుకుని, అందరం, ఎవరికి వారు, త్రికరణ శుద్ధిగా ప్రయత్నిస్తే మనచుట్టూ వున్న సమాజంలో మార్పు వస్తుందేమో. ఇటువంటి అందమైన సమాజాన్ని మనకు ఇమ్మని త్రిపురాంతకుని వేడుకుంటూ...... .*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు