*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౬౭ - 067)*
 *పరోపకార పద్ధతి*
చంపకమాల:
*ఒకయెడఁబవ్వళించు హరి, యొక్క యెడన్ వసియించు రాక్షస*
*ప్రకరము, లొక్కచో నడఁగుఁబర్వతసంఘము, లొక్కెడన్ బలా*
*హకములతోడ నుండు బడ బాగ్నియు; విస్తృత మూర్జితంబునుం*
*బ్రకటబరక్షమం బగుచు భాసిలు నౌర సముద్ర మెంతయున్.*
*తా:*
సముద్రము, నిజంగా మహా సముద్రమే. ఎంత గొప్పది సముద్రం. సముద్రం మీద ఒకవైపు మహావిష్ణువు పడుకుని వుంటాడు. అదే సముద్రం లోపల మహావిష్ణువు శత్రువులైన రాక్షసులు నివాసము చేస్తున్నారు. సముద్రం లో వేరొక వైపు ఎంతో ఎత్తైన, బరువైన మందరగిరి వంటి పర్వతాలు ఉన్నాయి. అంతే లోతులో తనని మిగేయాలి అని కోరలు చాచి తన మీదకి వస్తున్న బడబాగ్ని జ్వాలలు వున్నా, తట్టుకుని ఎదుగుతునే వున్నడు సముద్రుడు.......... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*మహాత్ములు, పరోపకార చింతనతో జీవనం చేసేవారు కూడా మహా సముద్రం లాగానే నిశ్చలులై, నిరాఘాటంగా ఇతరులకు మంచి చేసే తమ కార్యాలను కొనసాగిస్తానే వుంటారు. ఒక భీష్మ పితామహుడు, తనకు ఎన్నో పరీక్షలు ఎదరైనా, కురు రాజ్యానికి మంచి జేసి,  ఆ రాజ్యాన్ని ఉన్నత స్థానంలో చూడాలి అనే ధ్యేయం నుండి పక్కకు కదలలేదు.  ఒక కర్ణుడు, తనకు పాండవులలో ఒకడిగా మెలిగే అవకాశం వున్నా, తన మిత్రుడు దర్యోధనునకు ఇచ్చిన మాట నిలుపుకోవడానికి అసువులు బాశాడు. ఒక ప్రకాశం పంతులుగారు, ఒక గురజాడ, ఒక వివేకానంద, ఒక పరమహంస యోగానంద ఈ విధంగా మనకు మన సమాజంలో ఎందరో మహానుభావులు, ఎదుటి వారికి మంచి మాత్రమే జరగాలి అని అలోచించి జీవితాన్ని గడిపినవారు వున్నారు. వీరందరి స్థాయిలో కాకపోయినా, ఎంతో కొంత పరుల మేలు కొరకు ఆలోచించి, ఆ దారిలో నడవగలిగే ధైర్యాన్ని, స్థైర్యాన్ని మనకందరకు ఇవ్వమని అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని వేడుకుంటూ...... .*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు