మన భాష తెలుగు--తెలుసుకుంటే వెలుగు తెలుగు ఒడిలో...18 ;-వ్యాసకర్త; రాజావాసిరెడ్డిమల్లీశ్వరి
 గంధపు చెట్టు
అతి విలువైన చెట్లలో గంధపుచెట్టు ఒకటి. ఈ గంధపు చెట్టును చందన వృక్షము, వుంయజము, రోహణద్రుమము, శ్రీఖండము, హిమము, భద్రశ్రీ వంటి పేర్లతో పిలుస్తారు.
ఎఱ్ఱ చందనం, పచ్చ చందనం అనే రకాలుగా ఉండే గంధపుచెట్టు జన జీవితాలతో ముడిపడి ఉంది. గుణవంతుడైన వానివలన అతని వంశానికంతా మంచి పేరు వస్తుందనే విషయాన్ని వనానికంతా పరిమళాన్ని పులిమే గంధపుచెట్టు సువాసన గురించి-
కులములోన నొకడు గుణవంతుడుండిన
కులము వెలయువాని గుణము చేత
వెలయు వనములోన మలయజంబున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ - అని వేమన శతకంలో చెప్పబడింది. 
తనను ముక్కలు ముక్కలుగా చేసే గొడ్డలి కి కూడా తన సుగంధాన్ని పులుముతుంది. కాని కొంచమైనా కోపగించక మంచితనానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే వుంటుంది గంధపుచెట్టు.
 మన తెలుగు సాహిత్యంలో గంధం గురించి ...... గంధమలద మేని కంపు తగ్గించుకున్నట్టు, గంధపు చెక్కలు మోసిన గాడిద వాటి వాసనను అనుభవించలేదు. గంధ ద్రవ్యాలు మోసినా గాడిద గాడిదే. గంధము అమ్మినచోటే కట్టెలు అమ్ముట`వంటి సామెతలున్నాయి. వేసిదేమిరా, చూసినదేమిరా, వాసన చూసినదేమిరా` వంటి పొడపు కథలున్నాయి మన తెలుగుభాషలో. ఇంకా మన భాషలో`.
 " గంధము పూయరుగా, పన్నీటి గంధము పూయరుగా` వంటి కీర్తనలున్నాయి.

ఇంకా గంధపుచెట్టు సౌమ్యతను గురించి (భావతరంగాలు` 237)
‘‘చీరిన కోరిన చిలువలు కరచిన
నూరిన కోసిన నుగ్గుగ దంపిన
సౌరభమే వెదజల్లెడు చందన
భూరుహమా! నిను పొగడంగలమా’’ ` అంటూ మహీధర నళినీమోహన్‌ (పండితరాదుల వారి శ్లోకం  ) వివరించారు.
గంధం అనే పదంతో పూతిగంధం, సుమగంధం వంటి పదాలెన్నా ఉన్నాయి. ఒంటికి చలువను యిస్తూ, పూజలలో వాడబడుతూ విలువైన వస్తువులనెన్నింటినో తయారు చేయుటకు ఉపయోగపడే ఈ గంధపుచెట్టు ‘‘మొదలు వద్ద పాముల్ని, చెట్టుపైన కోతుల్ని, కొమ్మల్లో పక్షుల్ని భరిస్తూ, లోకానికి సువాసననిస్తూ మంచి చెడుల్ని అనుభవిస్తూ, లోకానికి మంచే చేయాలి అనే సూక్తిని మనకు తెలుపుతోంది.
గంధపుచెక్కను రాతిమీద అరగదీసి వచ్చిన గంధమును చర్మవ్యాధులకు, చెమట కాయల్ని తగ్గించటానికి, శరీర తాపాన్ని పోగొట్టి చల్లదనాన్ని కలిగించటానికి వాడతారు.
చూశారా! ఒక్కొక్క చెట్టు మనకెంతగా ఉపయోగపడుతోందో? మరి మనం..?

కామెంట్‌లు