వృద్ధాప్యం ఊసలు లెక్కపెడుతుంది;-డా.నీలం స్వాతిచిన్న చెరుకూరు,నెల్లూరు.ఫోన్ నెం- 6302811961
 వృద్ధాప్యం ఊసలు లెక్కపెడుతుంది వినడానికి వింతగానే వున్నా... 
నిజంగానే పచ్చి నిజం...
బహుశా నమ్మశక్యమయ్యేలా
ఉండక పోవచ్చు కానీ నమ్మక తప్పదు...
రాజీపడిన జీవితాల స్వీయ చరిత్రల కథనాలు రుజువు చేస్తున్న వాస్తవిక సాక్ష్యాలే ఇవి...
గమనాల గమ్యాలలో కనుమరుగైన కాలం
కనువిప్పును కలిగిస్తున్న వర్తమాన దృశ్యాలే ఇవి...
మీరు పరిస్థితులనండీ,
పరిణామాలనండీ...
పదం ఏదైనా సరే 
ప్రభావం మాత్రం ఆ పరిధిలోని వారికే...
విధి విధించిన శాపమనండి
ఫలించని ప్రయత్నాల లోపమనండి
నాలుగు గోడల నరకం మాత్రం ఆ కొందరికే...
వారిని అందరూ ఉన్న అదృష్టవంతులని అనాలో...
ఆత్మీయత కరువైన అనాధలనాలో అంతు పట్టడం లేదు...
విధిగా పరిశీలించి చూస్తే  
అన్నీ వున్న చోట ఆనందం ఉండదన్న మాట 
నిజమే కాబోలు అని అనిపిస్తుంది... 
అనుభవాలు అడిగే వారు కానీ,
అనుభూతులను పంచుకునే వారు కానీ,
అభిప్రాయాలను అడిగి తెలుసుకునే వారు కానీ,
ఆదర్శాలు అనుసరించే వారు కానీ ఎవ్వరూ లేరు....
పూసిన పువ్వులు వాడడం సహజత్వమే అని తెలిసినా సరే
మిత వైఖరితో వ్యవహరిస్తూ,
ప్రతి పనిలోను పరిమితులను విధిస్తూ,
వృద్ధి చెందిన వయసును వెక్కిరిస్తూ, 
లోపాలను ఎత్తి చూపుతూ నాటి తరాల పై 
నేటి తరాలు వ్యవహరిస్తున్న తీరు బాధాకరం...
ఇకనైనా మార్పు రావాలి...
కాదు కాదు ముందు మనం మారాలి…


కామెంట్‌లు