అక్షరం....;- - ప్రమోద్ ఆవంచ 7013272452
నిరంతరం,అనంతం అంచుల కింద
ప్రవహిస్తుందో ప్రేమ నది!
నీలి రంగు చీరలో ఆప్యాయంగా
సాగుతుంది.

అందం కన్నా ఇంకేదో ప్రత్యేకతను 
సంతరించుకుంది
ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తుంది
జీవం ఉట్టిపడుతుంది, జీవితాన్ని చదివేసింది
కళ్ళల్లో అనుభవం ప్రవహిస్తుంది

రెప్పలు దాటని ప్రవాహం అందరినీ అక్కున చేర్చుకొనే
ప్రేమ..
ఆ ప్రేమకు ఆదీ అంతం లేదు... అనంతం
అది ఒక సన్నటి తీగ,ఒడ్డున చల్లని నీటి ఒడిలో
కేరింతలు
చెవులకు ఇంపుగా గుండె వినిపించే బాల్యపు బడిలో అడుగుల చప్పుళ్ళు
మస్తిష్క తిన్నెల్లో చొచ్చుకుపోయిన పాదాల ముద్రలు

ప్రశ్నిస్తుంది, ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది
రాయడానికి విశ్వాన్ని సృష్టిస్తుంది, విశ్వాసాన్ని 
ఇస్తుంది.
వస్తువును ఇస్తుంది మెరుగు పెడితే,ఎత్తుగడల 
ఆలోచనా విధానాన్ని పెంచుతుంది.

అర్థం వుంటుంది, అర్థం చేసుకుంటుంది, అర్థవంతంగా
ఇమిడి పోతుంది.
ప్రవహిస్తుంది, ప్రయాణిస్తుంది, కూడా తీసుకెళ్ళుతుంది
కాల్పనిక ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది.
                           ‌    
                        

కామెంట్‌లు