: నాన్నంటే ...మా నాన్నే :;- మాదారపు వాణిశ్రీ--హన్మకొండ-- సెల్ : 9247286668
  "శభాష్ రా ధీరజ్ .. మా రఘురామయ్య కొడుకు అన్పించుకున్నావురా " అంటూ నాన్న చిరకాల నేస్తం మెప్పుకోలుతో కృతజ్ఞతా పూర్వక చిరునవ్వు ధీరజ్ పెదాలపై కదలాడింది.
           "పెంపకమంటే మీ నాన్నగారిదేరా ..పిల్లల్ని ఇంత ప్రయోజకులుగా తీర్చి దిద్దాలంటే , ప్రేమతో పాటు ధైర్యం ..అవసరమైతే దండించవచ్చన్న తెగింపు అంకుల్ కి మెండుగా ఉండటం వల్లనే నువ్విలా ప్రయోజకుడిగా ఎదిగావు " అంటున్న నా ప్రాణ స్నేహితుడు స్నేహిత్ మాటలకు మీసాలు మెలేస్తూ వాలుకుర్చీలో కూర్చున్న రఘురామయ్య గారి మోములో గంభీరమైన మందహాసం ....
         స్నేహిత్ చివరలో అన్న మాటలకు అతని వైపు చూసాడు ధీరజ్.
          "అవునురా...ధీరజ్ .. చిన్నప్పటి నుండి నీతో కలిసి తిరిగిన నాకు అప్పటి సంగతులన్నీ బాగా గుర్తున్నాయి . నువ్వు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకో " అన్నాడు స్నేహిత్.
         "అవును అప్పుడు అందరూ నన్ను బాగా అల్లరి పిల్లోడు " అనేవారని గుర్తు చేసుకుంటుంటే అప్పటి సంగతులన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకు రాసాగాయి.
         ** ** **
            అప్పుడు ధీరజ్ కు ఆరేళ్ళ వయసు. 
           "నాన్నా..నాన్నా !" అంటూ రఘురాం దగ్గరికొచ్చి గట్టిగా పట్టుకున్నాడు ధీరజ్ .
         వీడేదో మళ్ళీ తుంటరి పని చేసే ఉంటాడు... అదేంటో తెలుసుకోవాలని "ఏమయిందిరా ?" అని అడిగాడు రఘురాం . 
          "అమ్మ కొడుతోంది నాన్నా " అని ధీరజ్ చెబుతుండగానే ధీరజ్ తల్లి మృదుల లోపలి నుండి వచ్చింది .
       "ఆగు మృదులా .. అసలేం జరిగింది " అడిగాడు రఘురాం .
       "చూడండి .. వంటింట్లో ఏం పని వాడికి ? ఏదో తీద్దామని వస్తాడు .. గందరగోళం చేస్తాడు. ఇప్పుడు పైన పెట్టిన స్వీట్ డబ్బా తీయబోయి పక్కనున్న చక్కర డబ్బా, ఉప్పు డబ్బా కింద పడేసాడు. ఇప్పుడవి రెండూ కలిసి పోయాయి. ఇక అవి వేస్ట్ అన్నట్టేగా..ఎలా వాడుకుంటాం ?" కోపంగా అంది మృదుల .
         "ఎందుకలా చేసావ్ .." కొడుకు వైపు తిరిగి బుజ్జగిస్తూ అడిగాడు రఘురాం .
        "స్వీట్ తిందామని వెళ్ళాను ..నాకు అందలేదు నాన్నా " అన్నాడు ధీరజ్ .
       "ఎందుకు మృదులా ! అలా చేస్తావు .. మనం పిల్లలు తినాలనే స్వీట్లు చేస్తాము . మళ్ళీ అవి అందకుండా పైన పెడితే ఎలా చెప్పు ?" భార్యదే తప్పన్నట్టుగా మాట్లాడాడు రఘురాం. రఘురాం కు తెలుసు ...అతిగా తింటే జలుబు,దగ్గు వస్తాయని మృదుల జాగ్రత్త పడుతోందని . కానీ , ఇద్దరూ ఒకేసారి కోప్పడితే కొడుకు బెంగ పెట్టుకుంటాడని కొడుకు వైపు మాట్లాడాడు.
            నాన్న సపోర్ట్ దొరకటంతో 'హమ్మయ్య ' అనుకున్నాడు ధీరజ్ .
        నాన్న ప్రేమ , గారాబం అలుసుగా తీసుకొని వయసు పెరిగేకొద్దీ మరింత అల్లరిగా, జులాయిగా తయారయ్యాడు ధీరజ్ .
         స్కూల్ నుండి కూడా "చదువు మీద శ్రద్ధ పెట్టటం లేదని , ఎప్పుడూ అందరినీ ఏడిపిస్తాడని , అందరితో తిట్లు తింటున్నాడని" ఫిర్యాదులు రావడం మొదలయింది. 
         ఇక రఘురాం భరించలేకపోయాడు. అనునయించి మంచి - చెడు చెప్పటానికి ప్రయత్నించాడు. వినకపోతే కోప్పడ్డాడు. "ఇలాగే ఉంటే దుర్మార్గుడిగా తయారవుతావని , నిన్నెవరూ ఇష్టపడరని, ద్వేషిస్తారని , నీకు మంచి పేరు రాదని , నీకు సరైన భవిష్య త్తు ఉండదని" కఠినంగా కూడా చెప్పాడు.
         "నాన్న చెప్పేది నిజమేనేమో అని అప్పుడప్పుడు అనిపించినా ..అతని మనసు ఒప్పుకోలేదు. నన్ను తిట్టేవాళ్లే చెడ్డవారు " అన్న అభిప్రాయానికి వచ్చాడు ధీరజ్ .
        రఘురాం అనేక విధాలుగా ఆలోచించాడు... ఇక ప్రాక్టికల్ గా చూపించాలని అనుకున్నాడు. తన ఆలోచనల్ని ధీరజ్ స్నేహితుడు స్నేహిత్ కు చెప్పాడు. దానికి స్నేహిత్ సహకారం కూడా కావాలన్నాడు. అప్పటికి ధీరజ్ .. స్నేహిత్ పదవ తరగతి చదువుతున్నారు. స్నేహిత్ అన్నింటిలోనూ తెలివైనవాడు.. బుద్ధిమంతుడు. ధీరజ్ తో ఉన్న స్నేహం వల్ల , అతనంటే ఉన్న ఇష్టం వల్ల ..ధీరజ్ ఎలాంటి వాడైనా అతని స్నేహాన్ని విడిచి పెట్టలేదు. రఘురాం చెప్పిన విషయానికి సరేనన్నాడు.
            రఘురాం చెప్పిన సభలకు , పాజిటివ్ థింకింగ్ కార్యక్రమాలకు , వివేకానందుని స్ఫూర్తి దాయకమైన కార్యక్రమాలకు , ఇలా మంచి నడవడికతో ఉన్న కార్యక్రమాలన్నింటికీ తన తోడు కోసం రమ్మన్నట్టుగా చెప్పి ధీరజ్ ను కూడా తీసుకెళ్లటం మొదలుపెట్టాడు . అప్పుడప్పుడు విజ్ఞానాన్ని కలిగించే పోటీలకు రఘురాం తీసుకెళ్లేవారు. అక్కడ అందరూ బహుమతులు గెలుచుకోవటం .. మంచి పిల్లలందరినీ మెచ్చుకోవటం .. అన్నింటికన్నా ముఖ్యంగా ధీరజ్ సవ్యంగా చదువుకోకున్నా , అల్లరి పిల్లవాడయినా కూడా అక్కడ ఎవరైనా మీ బాబు ఏం చదువుతున్నాడని, ఎలాంటి పోటీలలో పాల్గొంటున్నాడని నిర్వాహకులు.. రఘురాం స్నేహితులు అడిగినపుడు .. బాబు బుద్ధిమంతుడని , కొన్ని క్విజ్ పోటీలలో పాల్గొంటున్నాడని చెప్పి చిన్న చిన్న పోటీలలో పాల్గొనేట్టు చేసేవారు. అక్కడ గెలుపొందిన పిల్లల్ని చూసి , నన్నూ మెచ్చుకుంటారన్న ఆలోచనతో ధీరజ్ కూడా పాల్గొనటం మొదలుపెట్టాడు . గెలిచినప్పుడు అందరూ మెచ్చుకుంటుంటే ఎప్పుడూ అందరితో తిట్లు తినే ధీరజ్ ఈ మెప్పుదలకు గొప్ప గా ఫీలయ్యాడు. నెమ్మది నెమ్మదిగా మంచి - చెడు తెలుసుకొని వృద్ధి లోకి వచ్చాడు . తండ్రిపై ఎంతో గౌరవం పెంచుకున్నాడు .
         " కంగ్రాచులేషన్స్ " అన్న అతిథుల గొంతుతో ఈ లోకం లోకి వచ్చాడు . 
        నిజమే .. నాన్న నా మీద పెట్టుకున్న నమ్మకానికి , నా ఎదుగుదలకు దోహదపడిన నాన్నకు మాత్రమే ఈ అభినందనలు చెందాలి . అందరిండ్లలో తండ్రికి కూతురంటే ఎక్కువ అభిమానం అంటారు . కానీ , నాన్నకు ఇద్దరూ సమానమే . అప్పుడప్పుడు అక్క కంటే నన్నే ఎక్కువ గారాబం చేసేవారు . మాటల్తో దండించే వారు తప్ప ఇంతవరకు ఒక్క దెబ్బ కూడా వేయలేదు నాన్న .
        ఇప్పుడు తను మల్టీ నేషనల్ కంపెనీ పెట్టటానికి అందించిన ప్రోత్సాహం కూడా నాన్నదే . నాన్న అందించిన ధైర్యం , జ్ఞానం లేకపోతే నేననేది లేను . అందుకే ఆ కంపెనీ చైర్మన్ గా నాన్ననే నియమించాను . నాన్న ఆశయాల మేరకు ఇప్పుడు తమ స్వంత ఊరిలో హాస్పిటల్ ప్రారంభిస్తున్నాను . దానికి మేనేజిమెంట్ గా నాన్న స్నేహితుల్ని నియమించాను . ఈ హడావిడి అంతా అందుకే .. నాన్న ఆ సంబరం లోనే నన్ను తన కొడుకని గర్వంగా చెప్పుకుంటున్నారు .
        "అరేయ్ స్నేహిత్ ... నిజమేరా ఒక్కొక్కటిగా అన్నీ తలుచుకుంటుంటే .. నాకు మా నాన్నని మించిన దైవం మా నాన్నకు ప్రతిరూపం అంటూ ఎవరూ లేరురా .. మా నాన్నకు సాటి మా నాన్నే . " నాన్నంటే ....మా నాన్నే " సంతోషంగా అన్నాడు ధీరజ్ .

కామెంట్‌లు