రంగు,సువాసన,సంగీతం;-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

 మీరెప్పుడైనా బస్సులో వెళుతున్నప్పుడు  రోడ్డు కిరువైపులా పచ్చని చెట్లు,అందమైన పువ్వుల తోటలను గమనించారా? అప్పుడు మీ మనసు పడిన అనందాన్ని నిశితంగా ఆలోచించగలిగిన మెదడును గురించి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి!
       విశేషమేమిటంటే మీఆఫీసుగానీ,ఇల్లు,స్కూలుగానీ ఆహ్లాదకర వాతావరణం కలిగి ఉంటే మనలో ఏకాగ్రత, పనిలో నేర్పు, మంచి ఆరోగ్య భావనలు కలుగుతుంటాయి!
 ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పరిశోధనలు ఒకసారి చూద్దాం.
      కంటికి ఇంపైనరంగులు, పచ్చదనం వంటి పరిసరాలు ఉద్యోగులలో పని నేర్పును పెంచుతాయి.అదే ముదురు రంగులు,చిత్రమైన మెరుపు గల బల్బలు ఉద్యోగులలో  అలసట, విసుగును పుట్టిస్తున్నట్టు పరిశోధనల తెలియ చేస్తున్నాయి.
     ఒక ఆసుపత్రిలో  పిత్తాశయం(gall bladder) శస్త్ర చికిత్స జరిగిన కొంత మందిని రెండు భాగాలుగా విభజించి,ఒక భాగం వారికి కేవలం గోడ కనబడేటట్టు,రెండవ భాగం వారికి కిటికీగుండా చక్కని పూల చెట్లు కనబడేటట్లు పడుకో బెట్టారు.గోడ కనబడేట్టు పడుకో బెట్టిన వారికంటే పూల చెట్లు కనబడేట్టు పడుకున్న వారు త్వరగా కోలుకున్నట్లు వైద్యులు గమనించారు.శస్త్ర చికిత్స అనంతరం వచ్చే రుగ్మతులు కూడా వీరికి తక్కువగా ఉన్నట్లు వైద్యులు గమనించారు!
      మధురమైన సంగీతం కూడా మెదడు ఆలోచనా శక్తిని పెంచుతుంది.ముఖ్యంగా శాస్త్రీయ సంగీతం వినేవారిలోమెదడు శక్తిని,ఆలోచనా శక్తిని పెంచుతున్నట్లు పరిశోధనలు తెలియ చేస్తున్నాయి. ఆల్బర్ట్ ఎయిన్ స్టెయిన్ చిన్నప్పటినుండే వయొలిన్ వాయించేవాడు.ఆయన అలా వయొలిన్ వాయిస్తున్నప్పుడే భౌతిక శాస్త్రానికి సంబంధించిన అనేక సృజనాత్మక ఆలోచనలు వచ్చినట్టు ఆయనవ్రాసుకున్నాడు.
      మరొక ముఖ్యమైన అంశం సువాసన, సువాసనలు మనిషి ఆలోచనా శక్తిని, పనిలో నేర్పును కూడా పెంచుతున్నట్లు పరిశోధనలు తెలియ చేస్తున్నాయి. జపాను లోని' ఇడిమెట్సు' ఆయిల్ కంపెనీ తమ ఫ్యాక్టరీలోని కార్మికులు నిమ్మ వాసన పీల్చుకునేట్టు చేశారు. ఆ మంచి సువాసన కార్మికుల పనితనం పెంచినట్లు,కార్మీకులు చేసే తప్పులు 54 శాతం తగ్గినట్లు అక్కడ జరిగిన పరిశోధనలు తెలియ చేస్తున్నాయి! ఆఫీసు గానీ,అంగడిగానీ తెరుస్తూనే మంచి అగరువత్తులు వెలిగిస్తే మనసు ఎంత హాయిని పొందుతుందో మీకు తెలిసిందేకదా!
     వెనిల్లా,రోజా వంటి సువాసనలు వత్తిడిని తగ్గిస్తున్నట్లు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఇలా రకరకాల వాసనలతో కొన్ని జబ్బులు నయం చేయవచ్చు. దీనినే 'ఆరోమా థెరపీ' అంటున్నారు.
    ఇలా ఇల్లైనా, ఆఫీసు అయినా ఆహ్లాదకర వాతావరణం, సువాసనలతో కూడి ఉంటే ఆలోచనా శక్తి, పనిలో చురుకుదనం పెరగుతుంది.చిరునవ్వులతో ఆనందాలు వెల్లి విరుస్తాయి!
            ***************

కామెంట్‌లు