బామ్మ మాట;-కంచనపల్లి వేంకట కృష్ణారావు 9348611445

  ' బామ్మమాట బంగారుబాట' ఇదేదో సినిమా టైటిల్ అనుకోకండి.నిజంగానే బామ్మ మాట లేక పెద్దలు చెప్పిన అనేక విషయాలు ఆణిముత్యాలు! జీవితంలో ఉపయోగపడేవే!
      కేవలం మనదేశపు బామ్మలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా బామ్మలు చెప్పినవి ఎన్నో బంగారు మాటలు ఉన్నట్టు పరిశోధనలు తెలుపుతున్నాయి. మనం 'బామ్మ మాట' అంటే ఇంగ్లీషులో ' old wives tales' అని పాశ్చాత్యులు వాడుతుంటారు.కేవలం ఇంగ్లీషులోనే కాకుండా ఇతర దేశస్థులు, ఉదా., ఫ్రాన్సులో ' అన్నీ ఫాబులె',అరబ్ దేశాల్లోని వారు 'samami-an-niswan,ఇద్దిష్ దేశస్థులు bubbe meises,స్పెయిన్ దేశస్థులు cuentos de viejas అని బామ్మ మాటను పిలుచు కుంటారు.
      చిత్రమేమిటంటే భాష ఏదయినా ప్రపంచవ్యాప్తంగా ఈ బామ్మమాటలు ఒకేరకంగా ఉంటాయి.ఉదాహరణకు "తడితలతో తిరగకు జలుబు చేస్తుంది" అనే బామ్మ హెచ్చరిక ప్రతిదేశంలో కనబడుతుంది.ఇది నిజం అని పరిశోధనలు తెలియ చేస్తున్నాయి.తడిలో జలుబును వృద్ధి చేసే వైరస్  త్వరగా వృద్ధి చెందుతుంది.
       ఇలాంటి విషయాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నవి సేకరించి ఆక్స్ ఫర్డ్ బ్రూక్స్ విశ్వవిద్యాలయానికి చెందిన మేరీ ఛాంబర్లిన్ అనే ప్రఫెసర్ 'old wives tales' అనే పుస్తకం ప్రచురించింది.
       కొన్ని బామ మాటల్ని తెలుసుకుందాం---తినగానే పరుగెత్తకు, ఈతకొట్టకు, గుడ్డి వెలుతురులో చదవకు,కడుపు నొప్పా అల్లం కషాయం తాగు,జలుబుకు పసుపు, మిరియాల కషాయం తాగు. ఇలాంటి విషయాలు ఎన్నింటినో శాస్త్ర పరంగా నిజాలు అని శాస్త్రజ్ఞలు నిరూపించారు. పసుపు, మిరియాలు ఆంటీ బయోటిక్ లక్షణాలు కలిగి ఉంటాయి.అల్లంలో కడుపుకు మేలు చేసే రసాయనాలు ఉంటాయి.తినగానే పరుగెత్తుతే కడుపులో నొప్పి అంటే cramps రావడానికి అవకాశం ఉంది.మెంతులు ఆరోగ్యానికి ఎంతో మంచివి అని మెంతికూర పప్పు, మొదలైన ఆహార పదార్థాల్లో మెంతులు వాడుతున్నారు.
       హైదరాబాదు లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ పరిశోధన ప్రకారం మెంతులు మధుమేహాన్ని గణనీయంగా అదుపు చేస్తున్నట్టు నిరూపించారు.
       అందుకే పెద్దల మాటల్ని నిశితంగా వినండి,వాటిలోని సత్యాన్ని తెలుసుకుని ఆచరించండి.
             ******

కామెంట్‌లు