మంచం;-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

   సీతాపతి,గజపతి,మహీపతి,చలపతి తెలివిగల వాళ్ళే నలుగురు నాలుగు విశ్వ విద్యాలలో ఉత్తమ చదువులు చదివారు.
        సీతాపతి వైద్య విద్యను అభ్యసించాడు.గజపతి న్యాయ శాస్త్రంలో దిట్ట అయ్యాడు.మహీపతి భౌతిక శాస్త్ర శాస్త్రజ్ఞుడు అయ్యాడు.చలపతి వాస్తు శాస్త్రంలో ప్రవీణుడయ్యాడు.
        నలుగురూ చదువులు ముగించుకుని సొంత ఊరికి వచ్చారు. రోజూ కలుసుకుని సంఘానికి తాము ఏవిధంగా మేలు చెయ్యాలో ఆలోచిస్తుండేవారు.
       ఓ సాయంత్రం నలుగురూ కలసి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. అప్పడే అక్కడికి గజపతి దూరపు బంధువు వచ్చాడు. అతను కూడా వారితో మాటలు కలిపి వారు చదువుల్లో రాణించిన తీరును ఎంతో మెచ్చుకున్నాడు. అతనికి ఒక సందేహం వచ్చింది, " మీలో గొప్ప చదువు ఎవరిది? మీ నలుగురి చదువు దేశానికి ఏ విధంగా ఉపయోగ పడుతుంది? మీలో మహీపతి భౌతిక శాస్త్ర చదువు అసలు ఉపయోగ పడుతుందా?" అనే సందేహం వ్యక్త పరిచాడు.
       అతని సందేహాన్ని అర్థంచేసుకున్న గజపతి " మా నలుగురి చదువులు సంఘానికి ఉపయోగ పడేవే, సీతాపతి వైద్యుడు కనుక ప్రజల రోగాలను నయం చేస్తాడు, అతని అవసరం సంఘానికి ఉంటుంది,నేనున్యాయశాస్త్రం చదివాను కనుక ఎవరికైనా న్యాయం కావాలంటే న్యాయస్థానంలో వాదించి న్యాయం సదరు వ్యక్తికి జరిగేట్టు చూస్తాను, మహీపతి భౌతిక శాస్త్రజ్ఞుడు అంటే ఖనిజాలు, అందరికీ ఉపయోగపడే యంత్ర సూత్రాలతో సంఘానికి మేలు చేస్తాడు,చలపతి వాస్తుశాస్త్రంలో ప్రవీణుడు అంటే ఇంటి దిక్కులను గురించే కాకుండా భవనాలను ఏవిధంగా కట్టాలో సూచిస్తాడు అదికూడా  సంఘానికి ఉపయోగమే కదా! మాలో ఏ ఒక్కరు లేకపోయినా సంఘంలో జనానికి ఇబ్బందే కదా" అని చెప్పాడు.
     "నీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మేము మంచంకోళ్ళ వంటి వాళ్ళం, అదిగో ఆపాత మంచం వద్దకు రా,చూపిస్తాను" అని చెప్పి గజపతి తన బంధువును తీసుకవెళ్ళి మంచం కోడు నొకదాన్ని కోసేశాడు. అంతే మంచం ఒక పక్క ఒరిగి పోయింది.
      "చూశావా, మంచం సంఘం అనుకుంటే మేం నలుగురం సంఘానికి ఉపయోగ పడే మంచం కోళ్ళవంటి వారం" అని వివరించాడు గజపతి.
      "అర్థమయింది,ధన్యవాదాలు" అని నలుగురికీ నమస్కారం పెట్టి ఆ గజపతి బంధువు వెళ్ళిపోయాడు.
             ************

కామెంట్‌లు