పిల్లి తపస్సు (సంయుక్త అక్షరాలు లేని బాలల కథ) --డా.ఎం.హరికిషన్ - కర్నూల్ - 9441032212
 ఒక అడవిలో ఒక ఎలుక ఉండేది . అది చానా ముసలిదైపోయింది. దానికి తిండి సంపాదించుకోవడానికి చేతకాక... ఏం చేయాలబ్బా అనుకుంటా వుంటే... దానికి వేటాడడం చేతగాని ఒక ముసలిపిల్లి కనపడింది. అది తిండి దొరకక బాగా బక్కగా అయిపోయింది. డొక్కలు బైటికి కనపడతా వున్నాయి. ఎలుకకు ఆ పిల్లిని చూడగానే ఒక ఆలోచన వచ్చింది. పిల్లి దగ్గరికి పోయింది. కానీ ఆ పిల్లి దాన్ని టక్కున పట్టేసి లటుక్కున మింగబోయింది. అప్పుడా ఎలుక... ''పిల్లి మామా... ఆగాగు. నువ్వూ ముసలిదానివే. నేనూ ముసలిదానినే. మనిద్దరి ఆకలిబాధ తీరే ఉపాయం చెప్పడానికే నీ దగ్గరికి వచ్చింది'' అంటూ ఏం చేయాలో చెప్పింది. పిల్లికి ఆ ఆలోచన నచ్చింది.
తరువాత రోజు చెట్టు కింద పిల్లి మౌనంగా రెండు కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటున్న దానిలా కూచుంది. కింద ఎలుక సంబరంగా అటూ ఇటూ వూగుతా భజనలు చేయసాగింది. అడవిలోని జంతువులన్నీ అటూ ఇటూ తిరుగుతా ఇదంతా చూశాయి. ఏమిటిదంతా అన్నాయి ఎలుకతో. అప్పుడా ఎలుక చిరునవ్వుతో... ''ఏమీ లేదు. నిన్న మన అడవికి ఒక ముని వచ్చాడు. ఎన్ని రోజులు ఇలా జంతువులను చంపుతా, దొంగతనాలు చేసుకుంటా, అందరితో మాట పడతా కాలం గడుపుతారు. ఇప్పటికే మీకు పాపం ఆకాశమంత పెరిగిపోయింది. వెంటనే అవన్నీ వదిలివేసి దేవున్ని తలుచుకుంటా, పదిమందికి చేతనైన సాయం చేసుకుంటా... కాలం గడపండి అంటూ మంచి మాటలు చెప్పాడు. దాంతో మన పిల్లిమామ... మాంసాహారం మానివేసి పళ్ళూకాయలూ, పాలూగింజలు తింటా మౌనంగా తపస్సు చేసుకుంటా బతకాలనుకున్నాడు. నేను గూడా పిల్లిమామకు సేవకునిగా మారిపోయి పదికాలాల పాటు మంచిపేరు తెచ్చుకోవాలని అనుకున్నాను'' అని చెప్పింది. ఈ పిల్లి గురించి ఎలుక చెప్పింది నిజమా కాదా అని అవి ఒక వారం పాటు గమనించాయి. పిల్లి తపస్సు నిజమని నమ్మి... ఆరోజు నుంచి మూడు పూటలా పిల్లీ ఎలుకలకి... ఒక కాయోపండో, పాలో మీగడో ముందు పెట్టి వెళ్ళ సాగాయి. దాంతో ఎలుకకు హాయిగా రోజూ విందు భోజనం దొరకసాగింది. నచ్చినవి తిని మిగిలినవి దాచిపెట్టుకోసాగింది.
అది చూసి పిల్లిమామ... ''ఏం అల్లుడూ... నీకు హాయిగా కూచున్న చోటికే రోజూ మూడుపూటలా అన్నీ వచ్చి పడుతున్నాయి. హాయిగా కాలు మీద కాలేసుకుని కమ్మగా తింటా వున్నావు. మరి నాకెలా. ఈ పళ్ళూ కూరగాయలు నేను చచ్చినా తినలేను. ఇక రోజూ ఈ చప్పని పాలు తాగీ తాగీ నాలుక చచ్చిపోయింది'' అంది. ఆ మాటలకు ఎలుక '' ఇంకో వారం ఆగు పిల్లిమామా... నమ్మినవాళ్లనే కదా బాగా మోసం చేయగలం. ఈ లోకంలో ఎదుటివాళ్ళు చెప్పింది నిజమా కాదా అని సొంతంగా ఆలోచించి అడుగులు వేసేవాళ్ళు చాలా తక్కువ. కొంచెంగుడా తెలివి లేకుండా అమాయకంగా అన్నీ నమ్మి బుట్టలో పడి మోసపోయే ఎదవలే ఎక్కువ. ఇప్పటికే నువ్వంటే దాదాపుగా అన్నింటికీ భయం పోయింది. బాగా నమ్మకం కుదిరింది. ఏవైనా చిన్న చిన్న జీవులు ఒంటరిగా దగ్గరికి వచ్చినప్పుడు గుట్టుచప్పుడు కాకుండా గుటుక్కు మనిపించడం మొదలుపెట్టు. కానీ తొందరపడి మొదటికే మోసం తేవద్దు'' అని చెప్పింది.
అప్పటి నుంచి పిల్లి ఒంటరిగా దగ్గరికి వచ్చిన ఏ పావురాన్నో, రామచిలుకనో, కాకినో, గద్దనో... ఎవరూ లేనిది చూసి కమ్మగా చప్పరించేయసాగింది. ఎలుక ఎప్పటికప్పుడు అక్కడ పడిన ఈకలన్నీ ఏరి పారేసి, ఒక గుంతలో వేసి దాచిపెట్ట సాగింది. ఎవరికీ అనుమానం రాకుండా, ఏమీ కనబడకుండా నున్నగా కసువు కొట్టసాగింది. అలా కొద్దిరోజులు గడిచేసరికి రెండూ బాగా మెక్కీ మెక్కీ లావుగా నున్నగా తయారయి బాగా నిగనిగలాడ సాగాయి.
అలా ఒక ఏడాది గడిచిపోయింది. ఎప్పుడూ పిట్టల కిలకిలలతో , నవ్వుల గలగలలతో కళకళలాడుతూ వుండే ఆ అడవిలో సగానికి సగం మాయమైపోయాయి. నెమళ్ళ ఆటలు లేవు, కోయిలల పాటలు లేవు. కాకుల అరుపులు లేవు, చిలుకల సందడి లేదు. ఇవన్నీ ఏం అయిపోతా వున్నాయో ఎంత ఆలోచించినా ఎవరికీ తెలియడం లేదు. దాంతో కొన్ని గద్దలు ఒక గుంపుగా తయారై అడవంతా నిఘా పెట్టాయి.
ఈ విషయం పిల్లీ ఎలుకలకు తెలియదు. దాంతో ఎప్పటిలాగే దగ్గరకొచ్చిన ఒక్కొక్క దాన్నీ కమ్మగా లాగించేయసాగాయి. అది ఒక గద్ద పసిగట్టి మిగతా వాటికి చెప్పింది. ఎలుక ఈకలన్నీ ఒక గుంతలో దాచిపెడతా వుంది కదా... అది అన్నింటికీ చూపించింది. దానితో గద్దలన్నీ కోపంతో వూగిపోయాయి.
వెంటనే పిల్లీ ఎలుకల దగ్గరికి వచ్చి... ''మీరిద్దరూ మాయమాటలతో మంచివాళ్లుగా నటించి, అడవిలో అన్నింటినీ మోసం చేశారు. మీలాంటి వాళ్లు ఈ లోకంలో బతకకూడదు'' అంటూ వాటి వెంటబడి ముక్కులతో కస కస కస పొడవసాగాయి. దాంతో ఆ రెండూ పుట్టల చాటున గుట్టల మాటున దాచిపెట్టుకుంటా... కిందామీదా పడి ఉరుకుతా... ఒక చిన్న గుహలోనికి దూరాయి. వాటి కోసం గద్దలు పైనంతా తిరుగుతా వెదకసాగాయి. దాంతో ఆ రెండూ భయపడిపోయి లోపలే ఉండిపోయాయి. ఎలుక చిన్నగా ఉంటాది కదా... దాంతో రాళ్ల చాటున , కొమ్మల చాటున దాచి పెట్టుకోని బయటకు వచ్చి... ఏదో ఒక పండో కాయో తిని మరలా లోపలికి వెళతా ఉంది. కానీ పిల్లి పెద్దగా వుంటాది కదా... దానితో బయటకు పోలేక భయపడి లోపలే ఉండిపోయింది. అలా రెండు రోజులు గడిచిపోయాయి. తినడానికి తిండి లేక పిల్లి ఆకలితో నకనకలాడసాగింది.
ఆ పిల్లికి ఎదురుగా ఎలుక బాగా లావుగా నున్నగా నిగనిగలాడుతా కనపడింది. ''ఇక ఈ ఎలుకతో నాకేం పని. ఈరోజు దీన్ని తిని నా కడుపు నింపుకుంటే సరిపోతుంది గదా'' అనుకుంది. వెంటనే ఆ పిల్లి ఎలుక దగ్గరికి రాగానే లటుక్కున దాన్ని పట్టేసుకుంది. అది చూసి ఆ ఎలుక లబలబలాడుతా ''పిల్లి మామా... వదులు. ఏంది నువ్వు చేసే పని. నేను నీకెంత సాయం చేశాను. అలాంటిది నన్నే తినాలి అనుకుంటున్నావా'' అంది.
ఆ మాటలకు పిల్లి నవ్వి... '' నీవు బతకడానికి అడవిలో ఎన్నింటినో నాతో చంపించావు. ఈరోజు నేను బతకడం కోసం నిన్ను చంపుతా వున్నా. ఇందులో తప్పేమి వుంది. అంతేగాక నాకు ఇంకో దారి కూడా లేదు'' అంటూ దానిని నోటిలో వేసుకొని గుటుక్కుమనిపించింది.
అంతలో ఒక గద్ద ఆ గుహ దగ్గరికి వచ్చి పిల్లిని గమనించి ''రండి రండి ఆ దొంగపిల్లి ఇక్కడే వుంది'' అంటూ గట్టిగా అరిచింది. అంతే గద్దలన్నీ సర్రున వచ్చి దానిని చుట్టుముట్టుకున్నాయి. ఇక ఆ పిల్లికి వాటి నుంచి తప్పించుకునే దారి లేకపోయింది.
************


కామెంట్‌లు