సోమన్న ముత్యాల హారాలు సాహితీ జీవనదాలు;-రాథోడ్ శ్రావణ్--ఉసావే.ఉట్నూర్, ఆదిలాబాద్ జిల్లా--సెల్:9491467715.
 ముత్యాల హారాలు
విలువైన సత్యాలు
విరబూసిన పుష్పాలు
ఆనంద బాష్పాలు
     
    
     గుడిలోని గంటలం
     మడిలోని పంటలం
     బడిలోని బాలలం
     మెడలోని మాలలం 
  
అలతి అలతి పదాలతో  అద్భుత రచనలు చేయగల చేయి తిరిగిన, బాల బంధు, బాలసాహిత్యవేత్త, కవిరత్న గద్వాల సోమన్న కర్నూల్ జిల్లా ఆలురు మండలంలోని మొలగవల్లి గ్రామంలో శ్రీమతి/శ్రీ గద్వాల నాగన్న , గద్వాల మరియమ్మ దంపతులకు 10 ఆగష్టు 1970 లో జన్మించారు.వృత్తి రీత్యా గణితోపాధ్యాయుడు స్కూల్ అసిస్టెంట్ గా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్.మురవణి  పెద్దకడబూర్ మండలం యందు విధులు నిర్వహిస్తున్నారు.ప్రవృత్తి రీత్యా సాహిత్య సృజన, సాంఘిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ  విద్యార్థులలోని దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడం, మాతృభాష పై మమకారం పెంపొందించడం పలు సామాజిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.మనిషి జీవితంలో బాల్యం అతి మధురం అందుకే మధురాతి మధురమైన బాల్యమెంత శ్రేష్టమైందో బాల సాహిత్యం కూడా అంతే శ్రేష్టమైనది.అందుకే  బాల సాహితీ వనంలో  పదిహేను పుస్తకాలు ఆవిష్కరించారు. 
పసిడి హృదయాలతో మొదలైనా తన తొలి రచన, 2. ఓ తెలుగు బాల,3.వెన్నెల బాల పదాలు,4.బ్రహ్మవాక్కు శతకము,5 రత్నాల సరాలు,6 గద్వాల మణిపూసలు, 7 చిట్టి చేతులు -గట్టి రాతలు,8.గద్వాల కైతికాలు, 9. గద్వాల చెప్పిన నీతి కథలు,10. వెన్నెలమ్మ పదాలు,11‌.సోమ నాఖ్యుమాట శతకము,12.అక్షర నక్షత్రాలు,13. హృదయ స్పందన,14. బాలల ముత్యాల హారాలు, 15. ముత్యాల హారాలు జీవిత సత్యాలు మొదలగు సంకలనాలు బాలల పై  వెలువరించడం  అద్బుతం.తెలుగు సాహిత్యంలో ప్రౌఢ సాహిత్యానికి  పోల్చితే బాల సాహిత్యం కొంత తక్కువేనని చెప్పక తప్పదు.మాతృభాషాభిమానంతో బాల సాహిత్యాన్ని ఎంచుకోని బాల సాహిత్యంలో  కవులను, రచయితలను, ప్రోత్సహిస్తు బాల సాహిత్యానికి ఎనలేని సేవ చేస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పురస్కారాలు, పతకాలు, ప్రముఖులచే ప్రశంసలందుకున్నారు.
ఈ ముత్యాల హారాలు జీవిత సత్యాలు  పుస్తకావిష్కరణ విద్యార్థుల సమక్షంలో ప్రధానోపాధ్యాయులు బి.శ్రీనివాసులు, ఉపాధ్యాయుల చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు.

గణితోపాధ్యాయుడైనా ఏ తెలుగు సాహిత్య ప్రక్రియయైనా అలవోకగా వ్రాయగల దిట్ట గద్వాల సోమన్న.అక్షర నక్షత్రాల కాంతిలో రాథోడ్ శ్రావణ్  రూపొందించిన ముత్యాలహారం తెలుగు సాహిత్యంలో నూతన లఘు వచన కవితా ప్రక్రియలో "ముత్యాల హారాలు_జీవిత సత్యాలు" అను పుస్తకం రెండోది కావడం విశేషం. స్వల్ప కాల వ్యవధిలో ఈ ప్రక్రియలో సోమన్న
వారివి రెండు పుస్తకాలు రూపుదిద్దుకోవడం ఆనందదాయకం, శుభపరిణామం అనుట సత్య దూరం కానేరదు.ఈ పుస్తక సాగరంలో ఎన్నో ఆణిముత్యాలాంటి ముత్యాల హారాలు కలవు.
కొన్ని ముత్యాల హారాలు పరిశీలిద్ధాం:-
"అందాల బాలలం/మందార మాలలం/కుందనపు బొమ్మలం/మందహాస జల్లులం". "పువ్వు వంటి పిల్లలం/నవ్వులాంటి మల్లెలం/దివ్వెలొసగు వెలుగులం/అవ్వకు మేము ఇష్టులం"."చిన్నారి బాలలం/సన్నజాజి మొగ్గలం/వెన్నెలమ్మ బుగ్గలం/కన్నవారి ఆస్తులం" అంటూ మల్లెల వంటి పిల్లల గురించి  చక్కగా అభివర్ణించారు."నాన్న మనసు త్యాగము/కుటుంబాన మోదము/సృష్టిలో అద్భుతము/జాలువారు అమృతము"."వెలుగులీను దీపము/భగవంతుని రూపము/సదనానికర్పితము/నాన్న మహోన్నతము". "నాన్న ప్రేమ శికరము/విజయానికి అభయము/దీవెనలకు నిలయము/వారు ఉన్న క్షేమము" అని జన్మనిచ్చిన నాన్న గురించి అమూల్యమైన ముత్యాల హారాలల్లి గౌరవంగా మెడలో అలంకరించారు."గురువు చూపును త్రోవ, మదికి పంచును చేవ/నడుపును బ్రతుకు నావ/తీయని పాలకోవ". "గురువు లేని విద్య వృధా/భగవంతుడు వారు కదా/జ్ఞానధార పోయు సదా/అనుసరించిన ఫాయిదా"అని గురువు గొప్పతనం విడమరిచి చెప్పారు.
 అందమైన అంత్యానుప్రాసలతో,  ఇలా ఎన్నో అంశాలను స్పృశించారు గద్వాల సోమన్న గారు.అచిరకాలంలో  తెలుగు సాహితీ క్షేత్రంలో అందనంత ఎత్తుకు ఎదిగి,తెలుగు భాషకు తన వంతు కృషి చేస్తున్న బాలసాహిత్య వేత్త గద్వాల సోమన్న. ఒక వైపు తాను రాస్తూ ఇంకో వైపు విద్యార్థులతో వ్రాయిస్తూ  ద్విపాత్రాభినయం చేస్తున్నారు. "పసి(డి)హృదయాలు " బాలసాహిత్య సమూహమును ఏర్పాటు చేసి తెలుగు తల్లి కి ఎనలేని సేవలందిస్తూ..అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.బాలబంధు ,గణితోపాధ్యాయుడు, కవిరత్న, గద్వాల సోమన్న కలం నుంచి మరిన్ని పుస్తకాలు వెలుగులోకి రావాలని ఉట్నూర్ సాహితీ వేదిక తరుపున మనసారగ కోరుకుంటూ...
  
 వెల :- 80/- 
ప్రతులకు :- గద్వాల సోమన్న
ఇం.నెం :1/1583 గాంధీ నగర్-వీధి, ఎమ్మిగనూరు కర్నూల్ జిల్లా 518360.కామెంట్‌లు