అమ్మలోని కమ్మదనం;-ఏ.బి ఆనంద్ఆకాశవాణి.94928 11322
 ధర్మపత్ని గురించి సంస్కృత శతకకారుడు "క్షమయా ధరిత్రి" అన్నాడు ఎంత రాస్తే అమ్మను గురించి  పూర్తిగా చెప్పగలం. ఏం చేసి అమ్మ రుణం తీర్చుకోగలం. బిడ్డ ఆకలి కోసం తన ఆకలి చంపుకొని  బిడ్డ కడుపు నింపే తల్లి మనసును ప్రపంచంలో ఎక్కడైనా చూడగలమా?  డబ్బుతో కొనగలిగేది కాదు ఈ మనసు  బిడ్డ తాగుబోతై  ఎన్ని అరాచకాలు చేసినా, ఇంట్లో ఎన్ని చెత్త పనులు చేసినా, వాడికి కడుపునిండా భోజనం పెట్టి కంటినిండా నిద్రపోయే ఏర్పాటుచేసిన తల్లి మనసును బేరీజు వేయగలవా.  ఇంత చేసినా, నా బిడ్డ బంగారం అని పొగుడుతూనే ఉంటుంది ఆ పిచ్చి తల్లి. పున్నామ నరకం... పునమ్నో నరకాత్రాయత ఇతి పుత్రః అని  పెద్దలు చెప్పిన సూక్తి  పున్నామ నరకం నుండి రక్షించేవారు పుత్రుడు అని.  మరి పున్నామ నరకాన్ని సృష్టించే వాడు తన కొడుకు అయినప్పుడు వాడికి ఏం పేరు పెట్టి ఉండేవాళ్లు, మనం ఊహించగలమా? ఇన్ని చేస్తున్నా  ప్రక్కనున్న వాళ్లు ఛీ కొడుతున్నా ఎన్నెన్ని మాటలు అంటున్నా, వాడినేమీ అనకండి వాడు ఇంకా చిన్నవాడు వాడే తెలుసుకుంటాడు  అన్నీ మానేస్తాడు  నేను వాడి బాగోగులు చూస్తాను కదా  అని వాడినే సమర్థిస్తుంది తప్ప  ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడదు. అలాంటి అమ్మ కడుపున పుట్టడం మన పూర్వజన్మ సుకృతం కాక మరేమిటి చెప్పండి. ఇంత  చేస్తున్న ఈ మూర్ఖుడిలో మార్పు వస్తుందా? ఎంతమంది గడ్డిపెట్టినా  తన అలవాట్లను మాత్రం మార్చుకోడు  ఒక్కొక్కరోజు ఒక్కో కారణం చెపుతాడు. తన స్నేహితుడు పుట్టినరోజు అని,  వాడి వివాహం అయిన సందర్భంగా  అందరికీ పార్టీ ఇస్తున్నాడని బొంకు తాడు తప్ప తన అలవాట్లను గురించి ఆలోచించడం కానీ, మార్చుకోవడం కానీ, వాడి జన్మలో జరగదు. అలాంటి  నీచులను కూడా  ఆప్యాయంగా చూస్తున్నది అంటే ఆ తల్లి  దేవతా స్వరూపం కాక మరి ఏమిటి చెప్పండి. ఇలాంటి తుచ్చులకు వేమన ఎలాంటి పేరు పెట్టి వుండేవాడో మనం ఊహించగలమా...


కామెంట్‌లు