ఈశ్వర సాక్షత్కారం;-ఏ.బి ఆనంద్,ఆకాశవణి.94928 11322
 అనేకమంది జ్ఞాన సంపన్నులు ఇహలోక సుఖాలు అన్నిటినీవదిలి మోక్షము పొంది స్వర్గ సుఖములు అనుభవించాలన్న కోరికతో  తపస్సమాధిలో కూర్చుంటారు. అలా కూర్చున్న వారిని మనం ఎద్దేవా చేస్తాం. స్వర్గంలో రంభ ఊర్వశి లాంటి పడతుల పొందు కోసం చేసే ప్రయత్నం అని. అసలు ముని అంటే మౌనంగా తాను చేసే దానిని గురించి ఆలోచించేవాడు, రుషి అంటే చరించేవాడు. తాను ఏది సాధించగలను అనుకున్నాడో దాని కోసం ప్రయత్నం చేసేవాడు అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ 
మోక్ష మార్గానికి రావాలని  తపస్సు చేస్తాడు. తపస్సు అంటేనే తనను తాను దహింప చేసుకోవడం అంటే భౌతికమైన అర్థం కాదు, అరిషడ్వర్గాలను జయించడానికి వారు చేసే ప్రయత్నమే తపస్సు. తపస్సులో కూర్చున్న పెద్దల ప్రయత్నాన్ని భగ్నం చేయడానికి వచ్చేది రంభ. మనం పద్మాసనం వేసుకుని కూర్చున్న 7 నిమిషాలకు కాళ్లు తిమ్మిర్లు ఎక్కుతాయి దానిని స్వాధీనం చేసుకోవాలి రంభ అంటే నితంబము (తొడ) అని అర్థం. తరువాత ఊర్వశి  ఊరువుకు అసి కటి ప్రదేశం  చివరిగా మేనక మేను అంటే శరీరం "క" అంటే ధరించడం  "శరీరమాద్యం ఖలు ధర్మసాధనం" అని ఉపనిషద్వాక్యం. శరీరాన్ని స్వాధీనం పరచుకున్న   తర్వాత తిలోత్తమ వస్తోంది. ఉత్తమమైన తిల (నువ్వు గింజ)  దానిని ఓంకార ప్రణవంగా చేసుకొని కుండలిని స్వాధీనపరచుకొని  వెన్నుపూస ద్వారా జయించి చివరకు కపాల మోక్షం పొందుతారు. దానిని వేమన ఎంత చక్కగా చెప్పాడో చూడండి. ఈ భూమి మీద ఎక్కడ తిరిగినా ఈశ్వర సాక్షాత్కారం కాదు  ఆకాశమంతా వెతికినా మీకు అక్కడా కనిపించడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా దొరకని వాడు మనసు శుద్ధిచేసి చూడరా శివుని అని హితవు పలికాడు. ఆత్మశుద్ధి లేకపోతే  నిన్ను నీవు వెతక లేకపోతే  మోక్ష ప్రాప్తి ఈ జన్మలో జరగదు అని చెప్తాడు వేమన.


కామెంట్‌లు