'ఈర్ల సమ్మయ్య కు క్రాంతిజ్యోతి జాతీయ నంది పురస్కారం'


 కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య కు 2022 సంవత్సరానికి గాను క్రాంతిజ్యోతి జాతీయ స్థాయి నంది పురస్కారం లభించింది. గత రెండు దశాబ్దాలుగా విద్య, సామాజిక, సాహిత్యo, కళారంగాల్లో ఈర్ల సమ్మయ్య విశేషంగా సేవ చేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన 'క్రాంతిజ్యోతి మహిళా సాధికారత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు గురువారం పరకాలలోని పద్మశాలి భవన్ లో ఆయనను పూలమాలలు, శాలువాతో ఘనంగా సత్కరించి, 'క్రాంతిజ్యోతి జాతీయ నంది పురస్కారం' అందజేశారు. ఈర్ల సమ్మయ్య ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన నాటి నుంచి పాఠశాలల్లో, పిల్లల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారు. నిరక్షరాస్యత నిర్మూలన, బడి మధ్యలో మానివేసిన వారిని బడిలో చేర్పించి, వారు చదువు కొన సాగించేలా చేస్తున్నారు. పిల్లలకే కాకుండా, వయోజన నిరక్షరాశ్యులకు చదువు నేర్పిస్తూ వారు ఓపెన్ స్కూల్ విధానం ద్వారా ఉన్నత విద్యను పొందేలా ప్రోత్సహిస్తున్నారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, మూతపడే స్థితిలో ఉన్న ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో  గణనీయంగా పిల్లల సంఖ్యను పెంచి, బడిని బతికించారు. పాఠశాల పిల్లల సర్వతోముఖాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. 'మధురిమలు' అనే నూతన తెలుగు లఘు కవితా ప్రక్రియను పొందించి, వందలాది మంది కవులు, కవయిత్రులు, రచయితల చేత కవితలు రాయించి, సమాజ మార్పు కోసం కృషి చేస్తున్నారు. తాను కూడా వచనకవితలు, ఇతర తెలుగు లఘు కవితలు, పాటలు, బాల గేయాలు, కథలు రాస్తూ, చైతన్య పరుస్తూ, సమాజ బాగు కోసం కృషి చేస్తున్నారు. కరోనా సమయంలో కరోనా నివారణ జాగ్రత్తలు గురించి ప్రజలకు తెలియ జేస్తూ, బాధితులకు తన సొంత ఖర్చులతో ఆహార పదార్థాలను అందజేశారు. జాతీయ స్థాయిలో నంది అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని ఈర్ల సమ్మయ్య తెలిపారు. ఈర్ల సమ్మయ్య కు అవార్డురావడం పట్ల మిత్రులు, శ్రేయోభిలాషులు, అధికారులు, ప్రజాప్రతినిధులు యువతీ, యువకులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు, పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కామెంట్‌లు