విల్లుపాట కళాకారిణి పూంగని!;-- యామిజాల జగదీశ్
 దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారి, తిరునల్వేలి‌, తూత్తుక్కుడి జిల్లాలలో ఓ ప్రత్యేకమైన తమిళ జానపద కళారూపాలలో విల్లుపాట్టు (విల్లు పాట) ఒకటి. విల్లు ఆకారంగా తయారు చేసిన దాని వింటిపై రెండు కర్రముక్కలతో ధ్వని పుట్టిస్తూ రాగాలు తీస్తూ కథ చెప్తారు. ఈ కళారూపంలో ఉడుక్కు, కుడం, తాళ, కట్టయ్ వంటివి  పక్కవాయిద్యాలుగా వినియోగిస్తారు. కేరళలోనూ కొన్ని ప్రాంతాలలో విల్లుపాట్టు కళాకారులు ఉన్నారు. 
విల్లుపాట కళకు అయిదు వందల ఏళ్ళ చరిత్ర ఉన్నట్టు పాలయంకోట్టయ్ లోని సెయింట్ జేవియర్ కాలేజీ జానపద కళల పరిశోధన కేంద్రం డైరెక్టర్ ఎన్. రామచంద్రన్ తెలిపారు. ఈ కళపై ఆయన విస్తారమైన రీతిలో అధ్యయనం చేశారు.
ఈ విల్లు పాట కళలో తన ప్రతిభతో లక్షలాది మంది అభిమానాన్ని పొందిన తొలి మహిళ పూంగని అమ్మాళ్.  ఈమెను పూంగని అని పిలిచేవారు. 
1934 నవంబరులో జన్మించిన ఈమె చరమాంకంలో అనారోగ్యంతోనూ పేదరికంతోనూ నానా అవస్థలుపడి గురై 2018 నవంబరులో కాలధర్మం చెందటం విచారకరం.
తమిళ మాసాలైన పంగుణి, చిత్తిరై, వైకాశిలలో దక్షిణ తమిళనాడులోని సుడలైమడన్, మారియమ్మన్, అయ్యనార్ వంటి గ్రామదేవతల ఆలయాలలో భారీ ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాలలో విల్లుపాటే ప్రధానంశం.
కన్యాకుమారి సమీపంలోని కొట్టారం శరవణంతేరిలో పూంగని పూర్వీకులు ఉండేవారు. అగస్తీశ్వరంలో పుట్టీపెరిగిన  ఈమె ఎనిమిది అడుగుల విల్లుపైన తను తీసే రాగాలకనుగుణంగా ఆమె రెండు కర్రముక్కలతో ధ్వని పుట్టించే తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేది. పొరుగున ఉన్న ఓ పల్లెలో లక్ష్మి, ధనలక్ష్మి అనే అక్కచెల్లెళ్ళ విల్లుపాట ప్రదర్శనకు ఆకర్షితురాలై ఆమెకూడా ఈ విల్లుపాట కళలో రాణించాలనుకున్నారు. అఈ ప్రాంతానికి చెందిన శివలింగం వాద్దియార్, వేదమాణిక్యం (ముగిలంవిల్లయ్) తదితరుల వద్ద ఈ కళారూపాన్ని నేర్చుకున్న పూంగని పదో ఏట నుంచే ఆలయాలలో విల్లుపాట పాడుతూ ఆదరణ పొందారు.
దక్షిణ తమిళనాడులో వెయ్యికిపైగా కార్యక్రమాలలో పాల్గొన్న పూంగని కోసం నిర్వాహకులు నిరీక్షించేవారు. ఆమె భర్త తంగపాండి గటం వాయించేవారు. వీరికి పిల్లలు లేరు. వృద్ధాప్యంలోనూ ఆమె దేవుడి కథలను గుర్తుంచుకుని తన వద్దకు వచ్చేవారికి వినిపించేవారు.
మద్రాసు విశ్వవిద్యాలయంవారు ఆమె విల్లుపాట పాడించి ముత్తుమారి బిరుదుతో సత్కరించారు.
2015లో కన్యాకుమారి జిల్లా ఆలడివిలై ఒట్రయ్ వీరన్ ఆలయంలో ఆమె చివరిసారిగా విల్లుపాట పాడారు. అప్పుడామె వయస్సు ఎనభై ఒక్క ఏళ్ళు. 2011లో భర్త తంగపాండి మరణించిన తర్వాత కొట్టారం రామచంద్ర నగర్లో నివసించిన ఈమెకు తమిళనాడు ప్రభుత్వం నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ మంజూరు చేసింది. జీవనాధారం కోసం ఎమ్మెల్యే, ఎంపీ తదితరులకు ఆమె దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆర్థికంగా మరెలాటి  సహకారమూ లభించలేదు. వారసులంటూ ఎవరూ లేకపోవడంతో అంత్యదశలో తమను చూసుకోవడానికి, అంత్యక్రియలు చేయడంకోసం తానుండిన ఇంటిని పొరుగిం టివారికి పూంగని దంపతులు రాసిచ్చేసారు.
ఆ మేరకు ఆ ఇంటివారే వీరికి అంత్యక్రియలు చేశారు.
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన స్టూవర్ట్ హెచ్. బ్లాక్ బర్న్ 1977లో కన్యాకుమారికి వచ్చి ప్రత్యేకించి పూంగని విల్లుపాటపై అధ్యయనం చేయడం విశేషం.  ఇప్పటికీ దక్షిణ తమిళనాడులో నూటయాభై విల్లుపాట బృందాలున్నాయి. ఈ కళను బతికించుకోవడం ఈ బృందం వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ తమవంతు కృషి చేస్తుండటం గమనార్హం.


కామెంట్‌లు