సమ్మోహనం (ముక్తపదగ్రస్తం);-ఎం. వి. ఉమాదేవి
పిట్టవంటి పువ్వులు 
పువ్వులు విరి గువ్వలు 
గువ్వలయి గుండెలో గుసగుసలు ఓ వనజ !

అచ్చమైనది పిట్ట 
పిట్ట కాదన ఎట్ట 
ఎట్ట మరిచేము ఈ పూలనే ఓ వనజ !

కాడ చివరిన జంట 
జంట గువ్వల పంట 
పంటగా వింతగా విరిసేను ఓ వనజ !

గింజలక్కర లేదు 
లేదు ఎగిరీ పోదు 
పోదుగా కన్నులకి పండగే ఓ వనజ !

అడుగు భాగం రెక్క
రెక్కలున్నవి పక్క 
పక్కపక్కన జేరి కువకువేదీ  వనజ? 

ఒక్క మొక్కది చాలు 
చాలు వాకిట వాలు 
వాలుగా మదిదోచుకొనిపోవు ఓ వనజ !

రంగు రంగుల పిట్ట 
పిట్ట రంగుల  పొట్ట 
పొట్టతో పూరేకు విరిసేను ఓ వనజ !


కామెంట్‌లు